కేంద్రమంత్రిగా దేశ రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవికి అనుకోని సమస్య వచ్చిపడింది. పర్యాటక శాఖ మంత్రిగా తొలి విదేశీ పర్యటనగా లండన్ వెళ్లి వచ్చిన చిరంజీవి ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన పర్యటన వివరాలు మీడియాకు వివరించారు. తనదైన స్టయిల్లో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దంచేశారు. కానీ అక్కడే అసలు సమస్య వచ్చిపడింది.  ఢిల్లీ మీడియా అంటే అన్ని భాషలకు చెందిన ప్రతినిధులూ ఉంటారు. దక్షిణాదికి చెందిన మీడియా వారికి హిందీ అయినా, ఇంగ్లీషు అయినా ఫరవాలేదుగాని ఉత్తరాది మీడియా ప్రతినిధులకు మాత్రం హిందీలోనే విషయాలు చెప్పాలి. కనీసం మొత్తం సారాంశాన్ని సంక్షిప్తంగానైనా హిందీలో వివరించాలి. చిరు తన పర్యటనలో ఏవేం జరిగిందీ ఇంగ్లీష్ లో చెప్పాక ఉత్తరాది మీడియా ప్రతినిధులు అదంతా హిందీలో చెప్పమని అడిగారు.  హిందీలో చెప్పమని అడగ్గానే చిరుకు ఇక్కసారి ఝలక్ ఇచ్చినట్టయింది. నిజానికి చిరంజీవికి హిందీ మాట్లాడటం రాదు. అందుకే ఓ చిరునవ్వు నవ్వేసి... అంత హిందీ ఇంకా నేర్చుకోలేదని, కొన్నాళ్లు వ్యవధి ఇస్తే నేర్చుకుంటానని చెప్పి అప్పటికి బయటపడ్డారు. అప్పట్లో చిరంజీవి ఒకట్రెండు హిందీ సినిమాల్లో నటించాడు. అప్పుడు ఎలాగోలా మ్యానేజ్ చేసిన చిరంజీవికి అప్పట్లో హిందీ అవసరం పెద్దగా రాలేదు. కానీ ఇప్పుడు కేంద్రమంత్రి పదవి వచ్చాక హిందీ భాష ప్రాధాన్యత తెలిసి వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: