బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్ ఇంకా ముగియలేదు. కానీ ఇండియా విజయం లాంఛనమే అని భావించాల్సిందే. ఎందుకంటే 30 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 107 పరుగులే. ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయింది బంగ్లా. ప్రమాదకర ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (25) ఔటయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న మహ్మదుల్లా (21) కూడా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇమ్రుల్ కయెస్ (5), మూడో నంబర్ ఆటగాడడు సౌమ్య సర్కార్ (29) కూడా పెవిలియన్ చేరిపోయారు. బంగ్లాదేశ్ నెంబర్ వన్ ఆటగాడు షకిబ్ 10 పరుగులకు ఐదో వికెట్ రూపంలో ఔటయ్యాడు.

బంగ్లాదేశ్ ఇంకా 20 ఓవర్లలోనే 196 పరుగులు చేయాలి. ముష్ఫికర్ రహీం మినహా చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ లేడు కాబట్టి భారత్ విజయం లాంఛనమే అనుకోవాలి. మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌కు శుభారంభమే దక్కింది. 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసిందా జట్టు. తమీమ్ జోరుమీద కనిపించాడు. భారత నెంబర్‌వన్ బౌలర్ షమి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాది భారత్‌కు హెచ్చరికలు పంపాడు. ఐతే ఉమేశ్ యాదవ్ వేసిన ఏడో ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మూడో బంతికి తమీమ్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. తర్వాతి బంతికి జడేజా అద్భుతమైన త్రోతో కయెస్‌ను రనౌట్ చేశాడు.

ఇక అక్కడి నుంచి బంగ్లా కోలుకోలేకపోయింది. మ్యాచ్‌లో బంగ్లా ఎంత పోరాడినా కష్టమే. భారత్ సెమీస్ చేరడం లాంఛనమే అనుకోవాలి. ఇక సెమీఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరన్నదే తేలాలి. శుక్రవారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్లో గెలిచే జట్టుతో భారత్ సెమీస్ ఆడుతుంది.

ఫామ్, బలాబలాల ప్రకారం చూస్తే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపు ఖాయమనే అనుకోవాలి. ఐతే పాకిస్థాన్ జట్టు ఎప్పుడెలా ఆడుతుందో చెప్పలేం. ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు, ఎంత చిన్న జట్టు చేతిలోనైనా ఓడగలదు. పైగా వాళ్లకు అచ్చొచ్చిన శుక్రవారం నాడు మ్యాచ్ జరగబోతోంది. ఒకవేళ పాకిస్థాన్ ఆస్ట్రేలియాకు షాకిచ్చి సెమీస్ చేరితో రసవత్తర పోరు ఖాయం. గత ప్రపంచకప్‌లో లాగే మళ్లీ భారత్, పాకిస్థాన్ సెమీస్‌లో తలపడతాయి. చూద్దాం.. అదే కథ పునరావృతమవుతుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: