ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించింది. ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక మిగిలింది రెండే రెండడుగులు. ఆ రెండడుగులు వేసేస్తే మరోసారి ప్రపంచకప్ మనదవుతుంది. అసలేమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్ ఇంత అద్భుతంగా ఆడుతుందని.. వరుసగా ఏడు విజయాలు సాధించి సెమీఫైనల్లో అడుగు పెడుతుందని.. ఏడుకు ఏడు మ్యాచ్‌ల్లోనూ మన బౌలర్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తారని ఎవరూ ఊహించలేదు.

ఐతే భారత జట్టు జైత్రయాత్ర చూసి.. ఇక మనకు తిరుగులేదని అనుకోవడానికేమీ లేదు. మన జట్టు వరుస విజయాలు సాధించడం గొప్పే కానీ.. సెమీస్ చేరడం మరీ అనూహ్యమేమీ కాదు. ఎందుకంటే ధోనీసేన ఈ స్థాయిలో జైత్రయాత్ర సాగించకుండా మామూలుగా ఆడినా సెమీస్ చేరేది. వెస్టిండీస్ జట్టు మూడు విజయాలతోనే క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

అలాగే భారత్ కూడా లీగ్ దశలో కిందా మీద పడిఉన్నా క్వార్టర్స్ చేరేది. ఇక బంగ్లాదేశ్ లాంటి జట్టుతో క్వార్టర్ ఫైనల్ అంటే, అదెంత ప్రమాదకర జట్టయినప్పటికీ గట్టి పోటీ అయితే ఇవ్వగలదు కానీ గెలవడం మరీ అంత కష్టమేం కాదు. లీగ్ వరుస విజయాల వల్ల బంగ్లాదేశ్‌ క్వార్టర్స్ ప్రత్యర్థి అయ్యేలా చేసుకున్నాం, ఆత్మవిశ్వాసం పెరిగింది.. ఈ రెండు లాభాలు జరిగాయన్నది మాత్రం వాస్తవం.

ఇందుమూలంగా చెప్పొచ్చేదేమంటే.. టీమ్ఇండియా ఇప్పటిదాకా సాధించింది ఓ ఎత్తయితే.. ఇక సాధించాల్సింది మరో ఎత్తు. మనోళ్లకు నిజంగా ఇప్పుడే అసలైన సవాల్ ఎదురు కాబోతోంది. ప్రస్తుతానికైతే అంచనాల ప్రకారం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవచ్చు. అందులో గెలిస్తే న్యూజిలాండ్ ఎదురవుతుంది. ఈ రెండూ అత్యంత ప్రమాదకర జట్లు. వీటిపై గెలిచి ప్రపంచకప్ అందుకుంటే అప్పుడు ధోనీసేన సిసలైన ఛాంపియన్ అనిపించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: