టిడిపి ఎంపి గల్లా జయదేవ్ కు చుక్కెదురైంది. ఒలింపిక్‌ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా గల్లా జయదేవ్‌ ఎన్నికను గుంటూరు న్యాయస్థానం నిలిపివేసింది. ఈ నెల 19న జరిగే ఎన్నికలకు పరిశీలకులను పంపాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌-కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తానే గెలిచానని సంబరాలు కూడా జరుపుకున్న గల్లాకు.. కోర్టు తీర్పుతో ప్రతి కూల పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 5న తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో ఒలింపిక్‌ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా గల్లా జయదేవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజేష్ కుమార్.. గుంటూరు న్యాయస్థానంలో గల్లా ఏకగ్రీవ ఎన్నికను సవాల్‌ చేశారు. పిటిషన్ ను విచారించిన గుంటూరు కోర్టు, గల్లా జయదేవ్ -ఎన్నికను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఐఓఏ అధ్యక్ష పదవిపై మరో టీడీపీ సీనియర్ నేత, ఎంపీ రమేష్ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆయనే గల్లా ఎన్నికను సవాల్ చేసినట్టుగా పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నిక నిలిచిపోవడంతో.. సీఎం రమేష్ - గల్లా మధ్య ఈ ఎన్నికలు ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుమతితో ఈ పదవికి పోటీ చేస్తానని రమేష్ -ప్రకటించడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది పార్టీ నేతల్లో ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: