రకరకాల ఇతర ప్రయోజనాలు ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాను సర్కారులోకి వచ్చిన తొలినాళ్లలోనే కేటాయించిన కేబినెట్‌ హోదా పదవి.. రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పోస్టు. పైగా ఆ పోస్టుకు కూడా ఆయన కేబినెట్‌ హోదాను కట్టబెట్టారు. ఇంతకూ తనకు కేబినెట్‌ హోదా మాత్రం ఉంటే సరిపోదు.. కేబినెట్‌లోనే తానుండాలని, తనను ఎమ్మెల్సీ కూడా  చేయాలని ఉవ్విళ్లూరుతున్న సదరు సలహాదారు.. ఇంతకూ మీడియా పరంగా చేస్తున్న ప్రచారం ఏంటో తెలుసా... ‘మా ఆవిడ ఆవకాయ పెట్టింది.. తెలుసా?’ అంటూ ఘనంగా టముకేస్తున్నారు.


ఇంతకూ ఎవరా సలహాదారు! ఆయన భార్య ఆవకాయ పెడితే ఏమిటి విశేషం అనుకుంటున్నారు కదా! వివరాల్లోకి వెళ్దాం. అనగనగా ఒక పరకాల ప్రభాకర్‌. ఆయన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా సలహాదారు. ఆయన భార్య నిర్మలా సీతారామన్‌. తమిళ ఇంటి ఆడపడచుగా, తెలుగింటి కోడలుగా రెండు రాష్ట్రాల కోటాలు కలిసి వస్తాయనే ఉద్దేశంతో కేంద్రంలో కీలక పదవి దక్కించుకున్న మోడీ కోటరీ నాయకురాలు. ఆమె కేంద్రంలో కీలకంగా ఉన్నది గనుక.. ఆమెను ప్రసన్నం చేసుకుంటే.. రాష్ట్రానికి ఒరగబెట్టేస్తుందేమోనని అనుకున్నారో ఏమో చంద్రబాబునాయుడు పరకాల ప్రభాకర్‌కు కేబినెట్‌ హోదాలో మీడియా సలహాదారు పదవి కట్టబెట్టారు. ఆయన కేబినెట్‌ మంత్రుల కంటె తానే ప్రభుత్వంలో కీలకం అని సంకేతాలు అందే రేంజిలో చాలా సందర్భాల్లో తానే అన్నీ అయి వెల్లడిరచేస్తూ ఉంటారు. అదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన సెక్రటేరియేట్‌లో మీడియా మిత్రులు కనిపిస్తే చాలు. ‘మా ఆవిడ ఆవకాయ పెట్టింది తెలుసా?’ అని ఊదరగొట్టేస్తున్నారట. 


‘అయితే ఏంటి?’ అని మీక్కూడా అనిపిస్తోంది కదా! అదీ నిజమే! కాకపోతే ఆయన దృష్టిలో మాత్రం అది చాలా విశేషమైన అంశం అనుకోవాలి. ఆయన సూటిగా ఎవ్వరినీ నోరు తెరిచి అభ్యర్థించలేదు గానీ.. ‘కేంద్రమంత్రి స్థాయిలో చాలా బిజీగా ఉండే తన భార్య.. మామిడికాయ ముక్కలు కొట్టి.. ఆవకాయ ఊరగాయ పెట్టిందంటే.. అది చాలా గొప్ప సంగతి అనుకుని.. తన ద్వారా ఆ సమాచారం తెలియగానే.. ప్రెస్‌ వాళ్లు.. పోలోమని వార్తలు రాసేస్తారని ఆయన అనుకున్నారు. అందుకే ఆ సమాచారానికి కాస్త తాలింపు జోడిస్తూ మా ఆవిడ ఆవకాయ పెట్టింది.. మా అమ్మ, అక్క కూడా ఆమెకు సహకరించారు అని చెప్పుకున్నారు. కాకపోతే కామెడీ ఏంటంటే.. ఆయన మాటలు విని మీడియా వాళ్లు చాటుకు వెళ్లి నవ్వుకున్నారే తప్ప.. ఒక్క పత్రిక విలేకరి కూడా వార్త రాయలేదు. 


అయినా చంద్రబాబు గారూ.. తమరు ఇలాంటి సలహాదార్ల మీద నెలసరి ఎన్ని లక్షలు తగలేస్తున్నారో తెలియదు గానీ.. ఆయన శ్రీమతి గారి ఆవకాయ గురించి ప్రచారం చేసుకోవడానికేనా.. అని జనం నిలదీస్తున్నారు మరి!!


మరింత సమాచారం తెలుసుకోండి: