సౌదీ అరేబియాలో ప్రజా సమూహం సమక్షంలో మరణ శిక్షలు అమలు చేసేందుకు అడ్డంగా తలలు తెగ నరికేవాళ్లు కావాలంటూ సౌదీ అరేబియా సివిల్ సర్వీసెస్ వెబ్‌సైట్ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. తలలు తెగ నరికేందుకు రెండున్నర లక్షల రూపాయలు విలువైన సంప్రదాయబద్ధమైన 4 అడుగుల వెండి కత్తిని, ఆకర్షణీయమైన జీతాన్ని, ఇంటి అలవెన్స్, ఆరు నెలల సిక్ లీవు ఇస్తామని ప్రకటించింది. దీనికి ఎలాంటి అనుభవం అవసరం లేదని, ఇస్లామిక్ షరియా చట్టాలకు నిబద్ధులై ఉంటే చాలని, నేరస్థుల తలలను తెగ నరికేందుకు గొర్రెల తలలను నరికించడం ద్వారా అవసరమైన శిక్షణను తామే ఇస్తామని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.

పబ్లిగ్గా మరణ శిక్షలు అమలు చేస్తున్నారు.

తలలు తెగనరికే వాళ్లు కావాలి!

దేశంలో మరణశిక్షల సంఖ్య పెరిగి పోతుండడం, మత విశ్వాసాలను వ్యతిరేకించే వారిని మినహా మిగతా వారి తలలు నరక కూడదనే 'వహాబిసమ్' నమ్మేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోవడంతో సౌదీలో మరణశిక్షలు అమలుచేసే తలారులకు కొరత ఏర్పడింది.ఇప్పటికే ఈ ఏడాది సౌదీ అరేబియా 89 మంది నేరస్థులకు బహిరంగంగా మరణ శిక్షలు అమలు చేసింది. మరణ శిక్షకు గురైన వారిలో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఇస్లాం మత విశ్వాసాలను ఉల్లంఘించిన వారితో పాటు అక్రమ లైంగిక సంబంధాలు కలిగిన వారికి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడిన వారికి ఇక్కడ పబ్లిగ్గా మరణ శిక్షలు అమలు చేస్తున్నారు. మద్యం సేవించడం, దొంగతనం చేయడం లాంటి నేరాలకు బహిరంగంగా చేతులు, కాళ్లు తీసేసే శిక్షలు అమలు చేస్తారు. మరణ శిక్షల్లో రెండు రకాలున్నాయి. తలలు తెగనరికి చంపడం ఒక పద్ధతైతే, రాళ్లతో కొట్టి చంపడం మరో పద్ధతి. మరణ శిక్షలను అమలుచేసే తలారులే అన్ని శిక్షలను అమలు చేయాల్సి ఉంటుంది.సౌదీలో మరణశిక్షను అమలుచేసే తీరు ఎలా ఉంటుందో, దానికి ప్రజల స్పందన ఎలా ఉంటుందో ఇటీవల రియాద్ నడిబొడ్డున అమలుచేసిన ఓ శిక్షను చూస్తే అర్థమవుతుంది. ఉదయం 9 గంటల ప్రాంతం... చాప్ చాప్ చౌక్‌గా ముద్దుగా పిలుచుకునే నగరం కూడలికి మహిళలు, పురుషులు తమ పిల్లలను తీసుకొని రావడం ప్రారంభమైంది. పిల్లలకు కూల్డ్రింకులు ఇప్పించి తాము కూడా చప్పరిస్తూ పెద్దలు జరగబోయే సంఘటన గురించి నిరీక్షిస్తున్నారు.


ఏం జరుగుతుందో ఎవరూ ప్రకటించకపోయినా ఏం జరగబోతుందో వారందరికీ తెలుసు.ఇంతలో ఓ పోలీసు వ్యాన్ అక్కడికి వచ్చింది. అందులో నుంచి 8 మంది అధికారులు దిగారు. తెల్లటి దుస్తులు ధరించిన ఓ నేరస్థుడిని వ్యాన్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. అప్పటికే కూడలిలో తళతళ మెరుస్తున్న 4 అడుగుల వెండి కత్తి పట్టుకొని తలారి నిరీక్షిస్తున్నాడు. అతని ముందుకు నేరస్థుడిని ఈడ్చుకొచ్చి మక్కా దిశగా ముఖం ఉండేలా మోకాళ్లపై కూర్చోబెట్టారు. శిక్ష అమలుకు సిద్ధమైన తలారి ట్రయల్ కోసం అన్నట్టు కత్తిని నేరస్థుడి మెడను తాకీ తాకనట్టుగా స్వింగ్ చేశాడు. అప్పటి వరకు సందోహంగా ఉన్న జనంలో ఒక్కసారిగా నిశ్శబ్దం చోటుచేసుకుంది. నేరస్థుడి చిట్లిన మెడ నుంచి రక్తం ధారాపాతంగా కారి అక్కడే ఉన్న మోరీలోకి కారిపోతోంది. తలారి కత్తి మళ్లీ గాల్లోకి లేచింది. ప్రజలు ఊపిరి బిగబట్టారు. తలారి కత్తి సర్రున స్వింగై ఒక్కవేటున నేరస్థుడి తలను మొండెం నుంచి వేరుచేసింది. అల్లంత దూరాన ఎగిరిపడ్డ ఆ తలను తలారి ఓ సంచిలో పెట్టి దాన్ని మొండానికి తాడుతో కట్టాడు. దాన్ని అక్కడే వదిలేశాడు. ప్రజలు భారంగా నిట్టూర్చి.. ఎవరిళ్లకు వారు పోయారు. మూడు రోజుల తర్వాత రియాద్ సివిల్ సర్వీసెస్ వాళ్లు వచ్చి ఆ శవాన్ని తరలించారు. మరణ శిక్షల అమలును చిత్రీకరించేందుకు ఎవరినీ అనుమతించరు. తలారులను ఇంటర్వ్యూ చేసేందుకు మాత్రం స్థానిక టీవీలను అనుమతిస్తారు. నేరస్థులకు నొప్పి తెలియకుండా తాము ఒక్క వేటుకు ఎలా తల నరికామో తలారులు ఆ ఇంటర్వ్యూల్లో వెల్లడించడం కనిపిస్తుంది. మరణశిక్ష అమలును జనంలో ఎవరో రహస్యంగా చిత్రించడం ద్వారా 1970లో తొలిసారి ఈ ఆటవిక శిక్షల గురించి ప్రపంచానికి తెలిసింది. ఇలాంటి శిక్షలను అమలు చేయరాదంటూ అంతర్జాతీయ సమాజం ఎన్నిసార్లు మొత్తుకున్నా సౌదీ ప్రభుత్వం వినిపించుకోలేదు. సౌదీకి మిత్ర దేశాలైన బ్రిటన్, అమెరికా దేశాలు ఇటీవల చేసిన విజ్ఞప్తులను కూడా పెడచెవిన బెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: