తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన ప్రారంభించి.. సుమారు 15 నెలలు కావస్తోంది. పరిపాలనకు మేం కొత్త కదా.. పరిపాలనకు అలవాటు పడాలి కదా.. అంటూ కొన్నాళ్లు గడిపేశారు. ఐఏఎస్‌ అధికార్ల కొరత ఉన్నదంటూ.. నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం.. పనులు జరగడం లేదు అంటూ మరికొంత కాలం కాలయాపన జరిగిపోయింది. ఈలోగా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు.. హైకోర్టు ముంగిట్లో ఆగిపోయాయి. రెండు రాష్ట్రాలకు ప్రమేయం ఉండగల అనేక అంశాలకు సంబంధించి కేసీఆర్‌ సర్కారు తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి. చాలా అంశాల్లో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఏదో ఒక రీతిగా అది వివాదంగా మారడం సహజం. అందుకే కోర్టు జోక్యం తప్పనిసరి అవుతోంది. తాజాగా సొంత రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా వెనక్కు తగ్గవలసిన పరిస్థితి దాపురిస్తోంది. ఈసారి కోర్టుకు భయపడి కాదుకదా.. ప్రజాగ్రహానికే జడిసి కేసీఆర్‌ మడమ తిప్పవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. అది చీప్‌లిక్కర్‌ విషయంలోనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


కేసీఆర్‌ సర్కారు గతంలో కూడా ప్రజల్లో మెజారిటీ వర్గానికి కంటగింపుగా ఉండే కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ప్రత్యేకించి విద్యుత్తు కొరత పంటలను కబళిస్తున్న తరుణంలో.. రైతుల ఆత్మహత్యల సందర్భంగా ప్రభుత్వం తీరు అనేక విమర్శల పాలైంది. ఇటీవల సుదీర్ఘమైన కసరత్తు తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తెస్తున్నాం అంటూ ప్రకటించిన విధివిధానాలు ప్రజలను కూడా విస్మయానికి గురిచేశాయి. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ లిక్కరు తాగించడం అనేది ప్రభుత్వం ధ్యేయం అన్నట్లుగా.. ఈ మద్యం పాలిసీ రూపొందింది. సింపుల్‌గా చెప్పాలంటే.. కొంచెం కాస్ట్‌లీగా కనిపించే దుకాణాల్లో నీళ్ల సీసా దొరికే ధరకంటె.. అంతకంటె తక్కువ మోతాదులో చీప్‌లిక్కర్‌ సీసా దొరికేలా సదుపాయంగా ఏర్పాటు చేశారంటే అతిశయోక్తి కాదు. 


అయితే చీప్‌లిక్కర్‌ మద్యం విధానంపై విమర్శలు విరుచుకుపడ్డాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ దుమ్మెత్తిపోశాయి. సోషల్‌ మీడియా సామాన్య జనం కూడా.. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఉద్యమ పార్టీలన్నీ.. మద్యం విధానాన్ని నిరసించాయి. గుడుంబాను అరికట్టేందుకే ప్రభుత్వం ఈ ప్రయ్నతం చేస్తున్నట్లుగా కేసీఆర్‌ కేబినెట్‌లోని మంత్రులందరూ మూకుమ్మడిగా ఒకే పాట పాడుతూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రజల ప్రతిఘటన వెల్లువ ముందు వారి పాచిక పారినట్లుగా లేదు. మొత్తానికి మద్యం పాలిసీ విషయంలో... విధానం మార్చుకుని చీప్‌లిక్కర్‌ ఆలోచన మానుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వస్తున్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది. అలాగే.. గుడంబా నియంత్రణకు ప్రత్యేకమైన కసరత్తు జరగాలని కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. ఆచరణలో ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంతమాత్రం ఉంటుందో కొంతకాలం ఆగితే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: