తన వ్యవహార సరళిలో చిన్న చిన్న ట్విస్ట్‌లు ఇవ్వడం ప్రధాని నరేంద్రమోడీకి అలవాటే! అలాంటిదే.. తన సింప్లిసిటీ గురించి.. అధికార ఆడంబరాన్ని ప్రదర్శించుకోకుండా ఉండడానికి సంబంధించి ఆయన తాజాగా ఒక కొత్త ట్విస్టు ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ.. వచ్చే శుక్రవారం నాడు రిషికేశ్‌కు వెళుతున్నారు. అక్కడ ఒక ఆశ్రమంలోని ఆధ్యాత్మిక గురువు స్వామి దయానంద గిరి అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయనతో మోడీకి సుదీర్ఘకాలంగా అనుబంధం ఉంది. అందుకని ఆయనను పరామర్శించేందుకు మోడీ వెళుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గంగానది తీరంలో ఆయన ఆశ్రమం ఉంటుంది. మోడీ అక్కడకు వెళ్లి పరామర్శించి తిరిగివస్తారు. ఇదీ షెడ్యూలు. 


షెడ్యూలు ఇదే గానీ.. ఇది ఆయన ''వ్యక్తిగత పర్యటన'' అని ప్రధానమంత్రి కార్యాలయం పదేపదే నొక్కి మరీ చెబుతోంది. దయానందగిరి ఆశ్రమానికి మోడీ.. ప్రధానిగా వెళ్లడం లేదని.. కేవలం నరేంద్రమోడీగా మాత్రమే వెళ్తారని పీఎంఓ ఓ ప్రకటనలో పేర్కొన్నది. 


ప్రధానిగా కాకుండా కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమే వెళతారనే ప్రకటన ద్వారా వారేం చెప్పదలచుకున్నారో మాత్రం అర్థం కావడం లేదు. అంటే ఏమిటి... ఆయన రిషికేశ్‌ వెళ్లే హెలికాప్టర్‌కు తాను తన సొంత జీతంలోంచి డబ్బు చెల్లించుకుంటారా? లేదా ఆయన రిషికేశ్‌కు వెళితే.. అధికారికంగా ప్రధాని వచ్చినట్లుగా పరిగణించి ఎలాంటి బందోబస్తు చేయకుండా పోలీసులు ఆయన భద్రతను గాలికి వదిలేస్తారా..? ఎలాంటి కారణాల వల్ల.. ఆయన టూరు ప్రధానిగా కాకుండా వ్యక్తిగా సాగుతుందో కూడీ పీఎంవో వివరించి చెప్పి ఉంటే బాగుండేది. 


అయినా.. దయానందగిరి ఆశ్రమనికి, అస్వస్థులను పరామర్శించడానికి ప్రధాని వెళ్లినంత మాత్రాన తప్పేమిటి. ఆరెస్సెస్‌ వారి సమక్షానికి వెళ్లి.. వారి హితోపదేశాలు విని వాటిని తెచ్చి ప్రభుత్వంలో అమలు చేయాలని చూసినప్పుడే.. ఈ దేశ ప్రజలు సహిస్తున్నారు. అలాంటిది పాపం.. అనారోగ్యంతో ఉన్న గురువును చూడడానికి వెళితే ప్రజలు ఎందుకు తప్పుపడతారు. ఇంత చిన్న విషయానికి ప్రధానిగా కాదు, వ్యక్తిగా (మోడీగా) వెళుతున్నారు అనేంత పెద్ద ప్రచారం ఎందుకో తెలియడం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: