సరిగ్గా మూడేళ్ల క్రితం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సంఘటన అది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షకు పూనుకుని మూడేళ్లు పూర్తి అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నేటినుంచి దీక్షా దివస్‌ను టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఉద్యోగసంఘాల జేఏసీ కలిసి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్ర సాధనకు ఊపిరినిచ్చిన కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు దీక్షా దివస్‌లో పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్, రంగాడ్డి జిల్లాల నాయకులు ఇందిరాపార్క్ వద్ద దీక్షకు దిగారు. క్షణ క్షణం ఉత్కంఠ 2009 నవంబర్ 29 న కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో కేసీఆర్ చరిత్రాత్మక ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. కేసీఆర్ ప్రకటన వెలువడిన క్షణం నుంచి తెలంగాణలో అప్రకటిత ఎమ్జనీ వాతావరణం నెలకొంది. కరీంనగర్ నుంచి దీక్షావేదిక వద్దకు బయలుదేరిన కేసీఆర్‌ను శివారులోని మానకొండూర్ వద్ద పోలీసులు నాటకీయంగా అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. అక్కడ సెకండ్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో కేసీఆర్‌ను ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. కేసీఆర్ జైల్లోనూ దీక్ష కొనసాగించారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని చెప్పి పోలీసులు నవంబర్ 30న ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసీఆర్ దీక్ష విరించినట్టు ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ను ఉద్యమ ద్రోహిగా చిత్రీకరిస్తూ ఉస్మానియాలో పెద్ద ఎత్తన ఆందోళనలు చెలరేగాయి. అయితే తాను దీక్ష విరమించలేదని బలవంతంగా వైద్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ 2న మంత్రి రాంరెడ్డి వెంకటడ్డిని కేసీఆర్ దగ్గరకు ప్రభుత్వం దూతగా పంపింది. అయినా దీక్ష విరమించలేదు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. డిసెంబర్ 4న రాష్ట్ర ప్రభుత్వ దూతగా మంత్రి దానం నాగేందర్ వచ్చినా కేసీఆర్ దీక్ష విరమణకు అంగీకరంచలేదు. డిసెంబర్ 5న అప్పటి సీఎం రోశయ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన చేతిలో లేదని చేతులెత్తేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు విద్యార్థులు, జేఏసీ నేతలు. డిసెంబర్ 6న కేసీఆర్‌ను రోశయ్య పరామర్శించి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జిల్లాలు బంద్‌తో దద్దరిల్లడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్పటి సీఎం రోశయ్యను ఢిల్లీ పిలిపించింది. ఆ వెంటనే తిరిగివచ్చి డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు సమ్మతిస్తున్నట్టు టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ రోశయ్యకు స్పష్టం చేశాయి. వాటిని కేంద్రానికి పంపారు. డిసెంబర్ 8న కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కేసీఆర్ దీక్ష విరమంచకపోతే ఏదైనా జరుగవచ్చని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. తెలంగాణ అంతటా ఉద్వేగం, ఉద్రేకం. ఏక్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో టీఆర్ఎస్, జేఏసీ, విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ మినహా మరోదారి గుర్తించిన కాంగ్రెస్ డిసెంబర్ 9న అత్యవసరంగా సోనియా నేతృత్వంలో కోర్ మిటీ భేటీ అయింది. డిసెంబర్ 9న రాత్రి 11 గంటల ప్రాంతంలో అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ వార్తను కేసీఆర్ కు చేరవేశారు. ఆయన దీక్ష విరమించారు. అంతే తెలంగాణ అంతటా ఒక్కసారిగా సంబరాలు. డిసెంబర్ 23న మరో ప్రకటన రాష్ట్రాన్ని సాధించామన్న ఊహల్లో ఉండగానే డిసెంబర్ 23న చిదంబరం చేసిన మరో ప్రకటన తెలంగాణలో అలజడి రేపింది. తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాంతాలవారీగా చీలిపోయారని... విభేదాలను తగ్గించేందుకు ప్రయత్నించినా కుదరలేదని చిరంబరం స్పష్టం చేశారు. దీంతో రాజకీయ పార్టీలతో మరోసారి సంప్రదింపులు జరపాల్సిన అవసరముందని భావిస్తున్నామంటూ డిసెంబర్‌ 23న మరో ప్రకటన చేశారు. అప్పటి నుంచి తెలంగాణవాదులు తెలంగాణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: