అవును క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతుండటమే ఇందుకు నిదర్శనం. కలియుగ వైకుంఠంగ ప్రసిద్ధికెక్కిన తిరుమలలోని దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించటానికి యావత్ ప్రపంచం నుండి భక్తులు వెల్లువల వస్తునే ఉంటారు. అలాంటిది చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మొదటిసారి దాదాపు మూడు నెలల పాటు ఆలయాన్ని మూసేశారు. ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహ్మమ్మారి కారణంగానే ఆలయాన్ని మూసేశారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు నెలల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యాన్ని కల్పించాలని ఆలయ ట్రస్టుబోర్డు నిర్ణయించింది.

 

వెంటనే ప్రయోగాత్మకంగా దర్శనం అవకాశాలు కల్పించారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేసే ఉద్యోగులు, వాళ్ళ కుటుంబాలకు దర్శనం అవకాశం కల్పించారు. రెండో దశలో తిరుపతిలోని స్ధానికులకు శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇలాగ ఓ ఐదు రోజుల తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ ను అధ్యయనం చేశారు. వైరస్  సమస్య ఎక్కడా ఎదురు కాకపోవటంతో ధైర్యం చేసి మిగిలిన భక్తులకు కూడా తిరుమలకు వచ్చే అవకాశం కల్పించారు. తిరుమలలో కాటేజీల బుకింగ్, శ్రీవారి దర్శనాలకు టైం తదితరాలతో పాటు వివిధ సేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

 

ముందుగా ఆన్ లైన్లో దర్శనం  టిక్కెట్లు జారీ చేయటం మొదలుపెట్టారు. రోజుకు 7 వేల మంది భక్తుల నుండి శుక్రవారానికి 12500 టికెట్లను జారీ చేసేవరకు పెంచారు. అయితే విచిత్రంగా శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య సుమారు 8 వేలు మాత్రమే. ఇందులో కూడా 2700 మంది మాత్రమే తలనీలాలు సమర్పించుకోవటం గమనార్హం. ఎలాగైనా తమకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చే భక్తులు తాజాగా తిరుమలకు రమ్మంటున్నా ఎందుకు రావటం లేదు ?  ఎందుకంటే భక్తుల్లో కరోనా వైరస్ విషయంలో ఆందోళన పెరిగిపోతోంది. ఎలాగంటే తిరుమలలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతుండటమే కారణమట.

 

ప్రయోగాత్మకంగా రెండు దశల్లో శ్రీవారి దర్శనాలను ఏర్పాటు చేసినపుడు తిరుమలలో కరోనా వైరస్ సమస్య ఎదురుకాలేదు. ఆ ధైర్యంతోనే మామూలు భక్తులందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పించాలని ఆన్ లైన్లో టికెట్లు జారీ మొదలుపెట్టారు. దాంతో టికెట్లు దక్కగానే భక్తులు ఎక్కడెక్కడి నుండి తిరుమల చేరుకుంటున్నారు. ఫలితంగా వేలాదిమంది మళ్ళీ తిరుమలకు చేరుకుంటున్న కారణంగా కరోనా వైరస్ సమస్య మొదలైపోయింది.  ఇప్పటికి సుమారు 100 మందికిపైగా కరోనా బాధితులను తిరుమలలో అధికారులు గుర్తించారు. స్వామివారి దర్శనానికి తిరుమలకు రావటం ఎందుకు కరోనాను అంటించుకోవటం ఎందుకనే ఆలోచన భక్తుల్లో మొదలైంది.

 

ఎవరైనా పుణ్యంకోసం తిరుమలకు వస్తారు కానీ కరోనా వైరస్ ను తగిలించుకోవటం కోసం కాదు కదా ? అందుకనే కన్ఫర్ముడు టికెట్లు చేతిలో ఉన్నా దర్శనం కన్నా ప్రాణమే ముఖ్యమన్న ఉద్దేశ్యంతో భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకుంటున్నారు. తిరుమలలో పెరిగిపోతున్న వైరస్ సమస్యను చూస్తుంటే మళ్ళీ తొందరలోనే శ్రీవారి దర్శనానికి బ్రేక పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చూద్దాం ఆ దేవదేవుడి లీలలు ఎలాగున్నాయో ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: