బ్రిటిష్ పాల‌కుల క‌బంధ హ‌స్తాల నుంచి దేశ దాస్య శృంఖాలాల‌ను తెచ్చ‌డానికి ద‌క్షిణా భారతాన‌ అల్లూరి సీతారామారాజు అగ్గి పిడుగుగా మారారు. స్వాతంత్ర్య స‌మ‌రంలో అల్లూరి సాగించిన పోరాటం విభిన్నం. అల్లూరి ఒక మహోజ్వల శక్తిగా బ్రిటిష్ వారిపై పోరాటం సాగించాడు. ఆ మ‌హ‌నీయుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పాలి.
సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.

 

అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే మ‌హిళ ఇతనిని ప్రేమించిందని, ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి విముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని ఒక విష‌య‌మైతే ప్ర‌చారంలో ఉంది.


చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం అధికంగా ఉండేవి. నిత్యం దైవ పూజ చేసేవాడు. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాలలో పర్యటించాడు.  ఈక్ర‌మంలోనే మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చెయ్యాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని పెంపొందించి, అన్యాయాలను ఎదిరించే విధంగా తయారుచేసాడు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వివాద పరిష్కారాలకు వచ్చేవారు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. 

 

మన్యం లోని గిరిజనులను సమీకరించి, వారిని దురలవాట్లకు దూరంచేసి, వారికి యుద్ధవిద్యలు, గెరిల్లా యుద్ధపద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేయ్యసాగాడు. అతని అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర, కంకిపాటి ఎండు పడాలు. వీరంద‌రూ కూడా సీతారామ‌రాజు ఆధ్వ‌ర్యంలో పోలీసు స్టేష‌న్ల‌పై దాడులు చేసి ఆయుధాల‌ను ప‌ట్టుకెళ్లేవారు. ఇలా బ్రిటిష్ పాల‌కుల‌కు సీతారామారాజు కంటిలో న‌లుసుగా మారాడు. త‌మ అన్యాయాల‌ను, అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తూ..బ్రిటిష్ సైనికుల‌ను..వారికి అండ‌గా నిలుస్తున్న వారిని హ‌త‌మారుస్తున్నాడ‌ని ఆగ్ర‌హంతో ఊగిపోయాయి. అల్లూరిని హ‌త మార్చేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాల‌ను..ప్ర‌త్యేక సైన్యాన్ని బ్రిటిష్ పాల‌కులు నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.

 

1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును (ఒక చెట్టుకు కట్టివేసి) ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితా భస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: