ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ క్రిస్ట్మస్. అనగా తెలుగులో క్రీస్తు యొక్క జన్మదినము అని. క్రైస్తవులంతా ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పర్వానికి విశిష్ట చరిత్ర ఉంది. యేసుక్రీస్తు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటినా అతనిని కరుణామయుడు గా మరియు దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు. ముఖ్యంగా మనం ఏ చర్చిలో విన్నా యేసు ని పాపుల రక్షకుడు అని అంటూ ఉంటారు. పాపులను రక్షించే అంతటి పరిశుద్ధుడు ఒక పశువుల పాకలో జన్మించవలసిన అవసరం ఏమిటని అందరికీ సందేహం రావచ్చు. అటువంటి వారి కోసమే అసలు క్రీస్తు పశువుల పాకలో జన్మించడానికి గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం.

 


మనం ఒకసారి యేసు పుట్టుక ముందు జరిగిన విషయం తలుచుకుంటే 'నజరేతు' అనే పట్టణంలో మేరీ మరియు జోసెఫ్ నివసిస్తుండగా మేరీకు జోసెఫ్ తో పెళ్లి కుదురుతుంది. అయితే వారి పెళ్లి జరిగే లోపలే మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి ఆమె దేవుడి అనుగ్రహం వల్ల కన్యగానే గర్భవతివి అయిందని మరియు ఆమెకు పుట్టిన కుమారుడికి 'యేసు' అను పేరు పెట్టమని చెబుతుంది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. కానీ పెళ్ళి కాకుండానే గర్భవతి అయితే ప్రజలందరూ ఆమె ఏదో పాపం చేసినట్లే భావిస్తారు. అయినా కానీ దైవానుగ్రహం వల్ల ఆమె దాల్చిన గర్భాన్ని ఏమాత్రం సంకోచించకుండా జోసెఫ్ ఆమెని పెళ్ళాడతాడు. ఇలా ఈ లోకంలో జరిగినా పాపాలను క్షమించడానికి దేవుడు సైతం 'పాపపు గర్భం' అనే ముద్ర తోనే భూమికి వచ్చి అందరికీ ఒక చక్కటి ఉదాహరణ గా నిలిచాడు అనే చెప్పవచ్చు. 

 


మేరీ మరియు జోసెఫ్ న్యాయ వంతులైన భక్తులు కావడంతో క్రీస్తు వారి బిడ్డగా ఈలోకానికి వచ్చేందుకు ఎన్నుకోబడగా అనుకోని పరిస్థితులు రీత్యా అతను జన్మించవలసిన స్థలం కూడా ఒక మురికి పాకలో కావడం విశేషం. లోక రక్షకుడు పుట్టాడు అని కొంతమంది చెడు వారికి సమాచారం అందడం... అదే సమయంలో రాజాజ్ఞను అనుసరించి జోసఫ్ బయలుదేరడం తో వారికి మార్గం మధ్యలో సరైన వసతి దొరకలేదు. దీంతో ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనివ్వగా మేరీ అక్కడే బాల యేసు ని ప్రసవించవలసి వచ్చింది.

 


ఒక కారణజన్ముడైన పరిశుద్ధ బాలుడు అటువంటి ప్రదేశంలో పుట్టడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే అతను జన్మించిన పశువుల పాక బెత్లెహేములోని పవిత్ర దేవాలయానికి దగ్గరగా ఉంది. అక్కడ బలి ఇచ్చే గొర్రెలను కాపలా వారు జాగ్రత్తగా కాపలా కాస్తుంటారు. అలా ఆ గొర్రెల వలే తాను కూడా త్యాగానికి ప్రతిరూపం అని సందేశం ఇస్తూనే మనలాంటి ఎంతోమంది గొర్రెలను కాచే గొర్రెల కాపరి పైన దేవుడు ఎప్పుడు చూసుకుంటాడని క్రీస్తు పుట్టుకతోనే యెహోవా ఒక సందేశం పంపించాడు. కాబట్టి ప్రతి ఒక్క దైవ కార్యం వెనుక ఒక కారణం మరియు ప్రయోజనం ఉంటుందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: