హిందువుల పండుగలన్నీ చంద్రమానం లేదా సౌరమానం అనుసరించి జరుపుకునేవి అయినా, ఈ రెండింటితో సంబంధం లేకుండా చేసుకునే ఏకైక పండుగ ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి, రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్షను ముగిస్తారు. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది.

 

ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం. పొట్ట నిండుగా ఉంటే మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఆకలితో శరీరం శుష్కించిన రోజున, మెదడు జాగరూకతతో మెలుగుతుంది. ఆ సమయంలో భగవంతుపై లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకోగలదు. అలాంటి మనసుని రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఉత్తేజిమవుతుంది. దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించవాడి స్థైర్యానికి తిరుగుండదని, భగవన్నామస్మరణతో ఏకాదశినాటి రాత్రిని గడపమని సూచిస్తారు.

 


ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. జపం, ధ్యానం. విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహా విష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం ద్వారా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందు వలననే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

 

పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతోషపడి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.

 

వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: