సంక్రాంతి తెలుగు వారి పెద్ద పండుగ. పంటల పండుగ. తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ ఇది. ఈ పండుగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లె లకు చేరుకుంటారు. అమ్మతోటి అనుబంధాన్ని, చిన్నప్పటి ఆట పాటలను, బాల్యస్నేహాలను, చిలిపి పనులను, బడిలో చదువుకున్న పాఠాలను అందరూ గుర్తు చేసుకునే సమయ మిది. సంక్రాంతి సమయంలో అందరి మనసులు ‘గతం’లోకి ప్రయాణిస్తాయి. ఊళ్లోని చెరువులో ఈత కొట్టిన అనుభవం, ఈతపళ్ల కోసం పడిన పాట్లు, దొంగతనంగా తెంపిన మామిడిపిందెలు.. ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు.. ఇవన్నీ నెమరువేసుకోవడానికి.. గుర్తుకు తెచ్చుకుని ఆనందించడానికి సంక్రాంతే తగిన సందర్భం.

 

ఒక‌ప్పుడు అమ్మాయిలు చాలా సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించేవారు. ఇప్పుడు అవేమి ఉండ‌డం లేదు. అస‌లు లంగాఓణీలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అమ్మాయిలంద‌రూ ఎంతో అందంగా చ‌లాకీగా చ‌క్క‌గా కాళ్ళ‌కు ప‌సుపురాసుకుని చ‌క్క‌గా లంగాఓణి వేసుకుని చేతినింగా గోరింటాకుతో నింపేసి... నిండుగా గాజులు వేసుకుని పెద్ద జ‌డ... ప‌ల్లెటూర్ల ఆడ‌ప‌డుచుల్లో క‌నిపించే ఆ అంద‌మే వేరు. పెద్ద జ‌డ త‌ల‌నిండా పూలు కొంత మందైతే ఈ సీజ‌న్‌లో వ‌చ్చే బంతిపువ్వుల‌తో పూల జ‌డ వేసుకుంటారు. ఇలా ఇవ‌న్నీ అప్ప‌ట్లో ఆచారంగా పాటించేవారు. 

 


కాని ఇప్ప‌టి ఆడ‌పిల్ల‌లో... కాళ్ల‌కు ప‌సుపు రాసుకునే యువ‌తుల‌ను ఇప్పుడు చూడ‌గ‌ల‌మా?  చేతినిండా గోరింటాకు పెట్టుకునే ప‌డ‌తులు మ‌న‌కు క‌నిపిస్తారా?   కొంగును న‌డుముకు బిగ‌గ‌ట్టి.. రోక‌లి చేత ప‌ట్టుకుని బియ్యం దంచే అతివ‌లు క‌నిపిస్తారా?  అంతా అధునాత‌నం.. కాళ్ల‌కు, వేళ్లకు కూడా ర‌సాయ‌న రంగులు పులుముకుని, ప‌ట్టు ప‌రికిణీల స్థానంలో లైట్ వెయిట్ దుస్తులు వేసుకుని, మిష‌న్ల‌లో ఆడించిన బియ్యంపిండితో వండి వార్చిన అరెసెల‌ను అతి క‌ష్టం మీద రెండు తిని త్రేన్చేసే సంక్రాంతి ప్రాభ‌వం కోల్పోయింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: