ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. గాలిపటం ఎగురవెయ్యడంలోని ఆనందం ఆనిర్వచనీయం. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ఏటా జనవరి నెల ఆరంభంతోటే సర్వత్రా గాలిపటాల కోలాహలం మిన్నంటుతుంది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల్లోనూ ఇప్పటికీ పతంగుల పోటీలు నిర్వహిస్తున్నారు. 


పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. ఆకాశమే హద్దుగా ఎగిరే పతంగులు తెలియని అనుభూతిని కల్గిస్తాయి. విభిన్నమైన రంగులలో, భిన్నమైన ఆకృతులతో ఉన్న పతంగులు ఆకర్షిస్తున్నాయి. యువతీ యువకులు పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలు, శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఇతర పక్షులు, ప్రకృతి సోయగాలు, కార్టూన్ బొమ్మలతో రెడీ చేసిన కైట్‌లు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి అంటేనే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి సందడిగా చేసుకునే పండుగ. ముఖ్యంగా గాలిపటాల పండుగ. మహిళలు ముగ్గులతో, రైతులు వ్యవసాయ పనుల్లో, పిల్లలు గాలి పటాలతో సంతోషంగా తమ సమయాన్ని గడుపుతుంటారు.

 

పతంగుల పండుగ పగలు మాత్రమే జరుపుకుంటా రనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. రాత్రుళ్లు కూడా గాలి పటాలు ఎగురవేస్తారు. వెలుగులు నింపుకున్న పతంగులు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి. వాటిని చూసి పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నారుల్లా చప్పట్లు చరిచి ఆనందించాల్సిందే. ఢిల్లీ దర్వాజా కూడా పతంగుల మార్కెట్‌కు పేరు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులు, రాజులు పతంగుల క్రీడను బాగా ప్రోత్సహించేవారట.

 

పతంగుల సంస్కృతి పూర్వకాలం నుంచే ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. క్రీ.పూ.206లో చైనాలో హేస్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. హేస్ చక్రవర్తికి వచ్చిన ఉపాయమే తొలి గాలిపటం. సుమారు 400 సంవత్సరాలకు పూర్వం అమెరికాలోని టరెంటం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌కే తొలిసారి పతంగిని ఆవిష్కరించినట్టు చరిత్ర చెప్తోంది. జపాన్‌లో 5 నుంచి 8 అడుగుల పతంగులను ఎగురవేస్తారట! నార్వేలో పతంగుల దినం పేరిట పండుగ జరుపుకోవడం సాధారణం. ఆసియా దేశాల్లో పతంగిని ఎగురవేయడం కొన్ని చోట్ల ఒక మతాచారంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో జపాన్‌లో పతంగుల పండుగను ఘనంగా జరుపుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: