ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. శబరిమలలో కొలువైవున్న అయ్యప్ప స్వామి క్షేత్రం, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది. ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాలనుంచి దీక్ష పూనిన స్వాములు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ ప్రాంతంలో భక్తులు ఆధ్యాత్మికానందం, సంతృప్తి, శ్రేయస్సువంటివి ప్రసాదించమని కోరుకుంటారు. ఈ సమయంలో జరిగే అయ్యప్ప స్వామి ప్రార్ధనలతో చుట్టూ ఉన్న కొండలన్నీ ప్రతిధ్వనిస్తాయి. గర్భగుడికి చేరేందుకు భక్తులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి ఉంటుంది.

 

ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి ప్రతీక అని ఒక నమ్మకం. అందుకే శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు అని అంటారు. మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము. కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లకు తాకి నమస్కరించుకున్న త‌ర్వాత ధ్వజస్తంభముని తాకి స్వామివారిని దర్శించుకుంటాము. 

 

అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలివనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.ఇక అయ్యప్పస్వామి 18 మెట్లు ఎక్కుతూ తన వద్ద ఉన్న అస్త్రాలు ఒక్కొక్కటీ ఒక్కో మెట్టు దగ్గర జారవిడిచినట్టు చెబుతారు. ఆ అస్త్రాలు: 1. శరం 2. క్షురిక 3. డమరుకం 4. కౌమోదకం 5. పాంచజన్యం 6. నాగాస్త్రం 7. హలాయుధం 8. వజ్రాయుధం 9. సుదర్శనం 10. దంతాయుధం 11. నఖాయుధం 12. వరుణాయుధం 13. వాయువ్యాస్త్రం 14. శార్ఞాయుధం 15. బ్రహ్మాస్త్రం 16. పాశుపతాస్త్రం 17. శూలాయుధం 18. త్రిశూలం
పద్ధెనిమిది కొండలు అని అంటుంటారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: