బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ పదవీ కాలాన్ని బోర్డు పొడిగించే ఆలోచనలో ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దీని కోసం ఏకంగా బోర్డు రాజ్యాంగాన్ని మార్చడానికి రెడీ అయ్యారు.


భారత క్రికెట్‌ కెప్టెన్‌గానే గొప్ప విజయాలు సాధించిన సౌరవ్‌ గంగూలీకి బీసీసీఐ అధ్యక్ష పదవి ద్వారా కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతులేమీ లేవు. ఆటగాడిగా కాకుండా అధికారిక హోదాలో ఏదైనా చేయాలనే పట్టుదల  దాదాలో  కనిపించింది. అదే అతడిని బోర్డు వైపు నడిపించింది. అందుబాటులో ఉన్న 9 నెలల కాలంలోనే తనదైన ముద్ర వేయాలని గంగూలీ తపిస్తున్నాడు. దీంతో క్రికెట్‌ ప్రక్షాళన గంగూలీతోనే సాధ్యమని భావించిన బోర్డు మెంబర్స్‌ అతని పదవీ కాలాన్ని పొడిగించాలని డిసైడ్‌ అయ్యారు.


ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో వచ్చే నెల 1న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అధ్యక్షతన 88వ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాను బోర్డు సభ్యుల ముందు ఉంచనున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఆమోదించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించనున్నారు. అయితే బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించాలంటే బోర్డు సభ్యుల్లో నాలుగింట మూడో వంతు మద్దతు అవసరం. అదే విధంగా బోర్డు సభ్యులు మద్దతు తర్వాత సుప్రీంకోర్టు ఆమోదం కూడా తప్పనిసరి. మొత్తం 12 పాయింట్లతో కూడిన ఏజెండాలో పలు కీలక విషయాలను చర్చించనున్నారు. ఇందులో ముఖ్యమైనది కూలింగ్ ఆఫ్ పిరియడ్.


బీసీసీఐలో అధ్యక్షుడిగా లేదా కార్యదర్శిగా వరుసగా రెండు పర్యాయాలు పనిచేసిన వారికి కూలింగ్ ఆఫ్ పిరియడ్ అమలు చేయబడుతుంది. ఇందులో భాగంగా రెండోసారి ఆ పదవిలో కొనసాగాలంటే మూడేళ్ల విరామం ఉండాల్సిందే. ఇప్పుడు దీనిని గనుక సవరిస్తే మరో ఆరేళ్ల పాటు సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగొచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ తొమ్మిది నెలలపాటే ఈ పదవిలో కొనసాగుతాడు. దీంతో ఈ రూల్స్‌ మార్చడానికి సర్వం సిద్దం చేస్తున్నారు బోర్డు మెంబర్స్‌. ఈ 12 పాయింట్ల ఎజెండాలో అంబుడ్స్‌మన్‌తో పాటు ఎథిక్స్ ఆఫీసర్, కొత్త క్రికెట్ కమిటీలు, క్రికెట్ అడ్వైజరీ కమిటీతో పాటు పలు బోర్డు నియమ నిబంధనలకు సవరణలను ప్రతిపాదించాయి. ఈ నిబంధనలన్నింటిని తొలగించే ఆలోచనలో బోర్డు ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: