విశాఖలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. భారత్‌- వెస్టిండీస్‌ మధ్య జరగనున్న రెండో వన్డేపై అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. టీమిండియాకు కీలకమైన ఈ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్‌ కనిపిస్తోంది. దీంతో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి.


విశాఖలో క్రికెట్ పండుగ వచ్చింది. బుధవారం భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే  జరగనుంది. ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో జరిగే ఈ మ్యాచ్‌లో రెండు జట్లు హోరాహోరీ తలపడనున్నాయి. ఇప్పటికే కరేబియన్లు తొలి వన్డే గెలవడంతో... మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విశాఖ వన్డే కీలకంగా మారింది. 


ఉత్కంఠను రేకెత్తిస్తున్న సెకండ్ వన్డే కోసం ఇప్పటికే ఇరు జట్లూ విశాఖకు చేరుకున్నాయి. వెస్టిండీస్, భారత జట్లు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇందుకోసం బీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహణ కోసం ఆర్గనైజింగ్ కమిటీ పలు కీలక చర్యలు చేపట్టింది. సుమారు 27వేల మంది కూర్చోగలిగే ఈ స్టేడియంలో పదిశాతం కాంప్లిమెంటరీ గ్యాలరీలు కేటాయించారు. సోమవారం సాయంత్రానికి 16వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. రెండువేలు, నాలుగువేలు ధర కలిగిన టిక్కెట్లు విక్రయిస్తున్నారు. కీలకమైన మ్యాచ్ కావడంతో స్టేడియం ఫుల్ అవుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

 

ఈ ఏడాది అక్టోబర్‌లో టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. సెక్యురిటీని దాటుకొని గ్రౌండ్ లోకి వెళ్లి క్రీడాకారులతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. అంతర్జాతీయ క్రికెటర్లు ఆడుతున్న మ్యాచ్ లో భద్రతా వైఫల్యం విమర్శలకు తావిచ్చింది. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించనున్నారు. అభిమానులు హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే విశాఖ స్టేడియం టీమిండియాకు సెంటిమెంట్. ఇక్కడ ఎక్కువ మ్యాచ్ లను భారతజట్టే గెలిచింది. ఇప్పుడు కూడా అదే ఫలితం వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: