ప్రపంచ క్రికెట్ లోనే అత్యంత ఖరీదైన లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్... అదేనండి మన ఐపీఎల్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ కి ఉండే స్థానమే వేరు. ముఖ్యంగా మొట్ట మొదటి సీజన్లో అయితే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యొక్క టీం కావడం మరియు ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓపెనర్ మెక్ కల్లమ్ రికార్డు సెంచరీతో ఘనమైన ఆరంభం ఇవ్వడం మరియు ఒక రేంజి ఉన్న స్టార్ క్రికెటర్లంతా ఈ టీమ్ లోనే ఉండడం మొత్తం ఐపీఎల్ కే ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. అయితే ప్రథమార్థంలో పెద్దగా ప్రభావం చూపని ఈ జట్టు ద్వితీయార్థంలో మాత్రం గంభీర్ సారథ్యంలో రెండు టైటిల్స్ ను సాధించి ఐపీఎల్ లోని డేంజర్ టీమ్స్ లో ఒకటిగా నిలిచింది.

 

అయితే గతంలో ఆ జట్టుకు రెండు సార్లు టైటిల్ అందించిన గంభీర్ ను మార్చేసి ఆ స్థానంలో దినేష్ కార్తీక్ ను తీసుకొని వచ్చారు. ఆ తర్వాత గంభీర్ మొత్తానికే క్రికెట్ ను వదిలి రాజకీయాల్లోకి వెళ్లి బిజెపి ఎంపీ గా కూడా గెలుపొందాడు. ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్ కు ఆక్షన్ మరొక రోజులో మొదలు కానుండగా ఈ జట్టు కి సంబంధించిన ఒక సరికొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఒకపక్క మరొక సీజన్ కు టైం దగ్గర పడుతుండడంతో అన్ని ఫ్రాంచెజీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండగా క్రితంలో ఒకసారి కెప్టెన్ మార్చి నష్టపోయిన కోల్‌కత్తా నైట్ రైడర్స్ యాజమాన్యం ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

 

కెప్టెన్ దినేష్ కార్తీక్ కెప్టెన్ గా గత సీజన్ లో ఘోరంగా విఫలం అయ్యాడు అని చెప్పాలి. టీం కూర్పు మరియు భీకరమైన బ్యాట్స్ మెన్ ను ఏ స్థానంలో ఆడించాలి అన్న విషయంపై పదే పదే పొరపాట్లు చేసిన కార్తీక్ ను కాదని యాజమాన్యం ఇప్పుడు జట్టు సారథ్యాన్ని వేరొకరికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ మొదటి నుండి ఎంతో అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకున్న శుభమన్ గిల్ వైపు ఇప్పుడు షారుక్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్ లాంటి యువ కెప్టెన్ రాకతో ఎన్నడూ లేని విధంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుంటే తామెందుకు ఆ పని చేయకూడదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఐపిఎల్ ఆక్షన్ ముందుగా తమ జట్టు యొక్క కొత్త కెప్టెన్ ను కోల్‌కత్తా నైట్ రైడర్స్ ప్రకటించే అవకాశం ఉంది. చూద్దాం షారుక్ ఖాన్ ఎలాంటి సర్పం ఇవ్వబోతున్నాడో.

మరింత సమాచారం తెలుసుకోండి: