ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు? మన మాటలు... చేతలు అందరూ గమనిస్తుంటారు? భారత్‌ గర్వించే మహిళా బాక్సర్‌  మేరీకోమ్‌లో ఈ రెండు అంశాలూ లోపించాయ్‌. ఆటతో అందుకున్న గౌరవాన్ని.. అదే ఆటలో తన ప్రవర్తనతో విమర్శల పంచ్‌ ఎదుర్కొంటోంది. క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి అభిమానులను నివ్వెరపరిచింది. 

 

చాలా వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన మహిళా క్రీడాకారిణి మేరీకోమ్‌. ఎన్నో ఆటుపోట్లు.. కష్టాలు ఎదుర్కొని బాక్సింగ్‌ రింగ్‌లో తన పంచ్‌లతో పసిడి ఒడిసి పట్టింది. ఒక్క భారతే కాదు.. ప్రపంచం గర్వించే బాక్సర్‌గా గుర్తింపు పొందింది మేరీకోమ్‌. పెళ్లి అయినా.. వయసు పైబడినా.. తనలో ఇంకా అదే పవర్‌ ఉందని ఎందరికో స్ఫూర్తి నిచ్చింది ఈ దిగ్గజ బాక్సర్‌. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు సాధించడమంటే మామూలు విషయం కాదు. ఒలింపిక్స్‌లో కాంస్యం మరో మణిహారం. ఇన్ని రికార్డులు సాధించిన  మేరీకోమ్‌ తనను సవాల్‌ చేసిన తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌ను ఓడించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇంత వరకూ దీనిని ఒక ఆటగానే చూడాలి. కానీ.. ఈ బౌట్‌లో గెలిచిన తర్వాత మేరీకోమ్‌ తీరు, ప్రవర్తనతో గౌరవాన్ని తగ్గించుకుంది. 

 

ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్‌ టోర్నీ కోసం రూల్స్‌ ప్రకారం  మేరీ కూడా ట్రయిల్స్‌లో పాల్గొనాలని నిఖత్‌ డిమాండ్‌ చేసింది. ఇదేదో చేయరాని నేరం అన్నట్లు బౌట్‌ సమయంలో తోటి క్రీడాకారిణి అయిన తెలుగమ్మాయిని దూషించడం.. పోటీ అయ్యాక చేతులు కలపకుండా వెళ్లిపోవడం... విలేకరుల ఎదుట ప్రత్యర్థిని అనరాని మాటలు అనడం మేరీ అభిమానులను సైతం విస్మయపర్చింది.

 

టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ల కోసం  చైనాలో జరగబోయే క్వాలిఫైయింగ్‌ టోర్నీలో పోటీ పడే భారత మహిళా బాక్సర్ల కోసం  ఢిల్లీలో బౌట్‌ నిర్వహించారు. 51 కేజీల విభాగంలో నిఖత్‌, మేరీ తలపడ్డారు. పోటీ హోరాహోరీగా సాగినా... 9-1 తేడాతో మేరీయే విజేతగా నిలిచింది. నిఖత్‌ పూర్తిస్థాయిలో పోరాడినా..మేరీకి అనుభవం కలిసొచ్చింది. చివరి మూడు నిమిషాల్లో గేమ్‌ తనవైపు తిప్పుకొంది. ఈ ఆటను చూసిన వాళ్లకు అదొక గేమ్‌గా సాగినా... రింగ్‌ లోపల జరిగింది  వేరు! 

 

బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని తప్పుపడుతూ కేంద్ర క్రీడా శాఖకు నిఖత్‌ లేఖ రాసింది. దీంతో అసలు నిఖత్‌ ఎవరు అంటూ తక్కువ చేసి మాట్లాడింది మేరీ. యువ బాక్సర్లు ఎవరూ తనలా గెలవలేరంటూ వ్యాఖ్యలు చేసింది. నిఖత్‌కు మద్దతుగా నిలిచిన అభినవ్‌ బింద్రా వంటి వారినీ విమర్శించింది.  ఇక బౌట్‌ సందర్భంగా తీవ్ర పదజాలంతో మేరీ తనను తిట్టిందని నిఖత్‌ వాపోయింది. ఆట ముగిశాఖ నిఖత్‌ చేయి కలపబోతే విసిరి కొడుతూ వెళ్లిపోయింది మేరీకోమ్‌. ఆనవాయితీ ప్రకారం కౌగిలించుకోబోతుంటే తిరస్కరించింది. బౌట్‌ గెలిచాక ఆమె ప్రవర్తించిన తీరూ ఆశ్చర్యపరిచింది. ఒక ప్రశ్నకు ఇలా పగబట్టినట్లు మేరీ వ్యవహరించడం విమర్శల పాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: