భారత క్రికెట్‌లో ది బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఎంఎస్‌ ధోనీ. టీమిండియా క్రికెట్‌లో అలాంటి చెరుగని ముద్ర వేశాడు మహేంద్రుడు. అయితే టీమిండియా పేస్‌ బౌలర్‌ ఇషాంత్‌... ధోనీ కెప్టెన్సీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

 

ప్రస్తుతం  ప్రపంచంలోనే అత్యంత పదునైన పేస్ దళం ఏదంటే ఎవర్నడిగినా టీమిండియా అనే చెబుతారు. కోహ్లీ కెప్టెన్సీలోని భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ప్రపంచంలోని ఏ అగ్రశ్రేణి బ్యాటింగ్ లైనప్‌కైనా ముచ్చెమటలు పోయిస్తుంది. పిచ్‌లతో సంబంధం లేకుండా చెలరేగుతున్న టీమిండియా పేసర్లను చూస్తే పెద్ద జట్లు సైతం హడలిపోయే పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మార్పు కోహ్లీ కెప్టెన్సీలో వచ్చిందని చెబుతున్నాడు టీమిండియా పేసర్‌ ఇషాంత్‌. ధోని సమయంలో తనకు ఎక్కువగా అవకాశాలు రాకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. అసలు ఫాస్ట్‌ బౌలర్లకు నిలకడగా ధోని ఎప్పుడు అవకాశాలు ఇచ్చాడంటూ ఇషాంత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

 
ధోనీ భారత క్రికెట్‌కు మరపురాని విజయాలు అందించి ఉండొచ్చు... కానీ అతని సారథ్యంలో ఒకే ఒక్క విషయంలో భారత్ వెనుకబడిపోయిందని ఇషాంత్ తెలిపాడు. ధోనీ హయాంలో పేసర్లు ఇంత నిలకడగా ఎప్పుడూ రాణించలేదని, అందుకు కారణం  ధోనీ తీసుకున్న నిర్ణయమేనని తెలిపాడు లంబూ. ఫాస్ట్ బౌలర్లకు రొటేషన్ పద్ధతిలో అవకాశాలు ఇవ్వాలని ధోనీ నిర్ణయించుకోవడంతో, ఏ బౌలర్‌కూ తగినంత అనుభవం లభించలేదని వెల్లడించాడు. బౌలర్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడంతో తమ మధ్య అవగాహన ఏర్పడలేదని వివరించాడు ఇషాంత్‌. అయితే కోహ్లీ కెప్టెన్సీలో ఆ పరిస్థితి మారిందన్నాడు ఇషాంత్‌.  పేసర్లకు నిలకడగా అవకాశాలు ఇవ్వడంతో రాటుదేలారని ఇషాంత్‌ వ్యాఖ్యానించాడు. లంబూ వ్యాఖ్యలపై మిస్టర్‌ కూల్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ధోని లేకపోతే ఇషాంత్‌ జట్టులోకి వచ్చేవాడు కాదంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: