భార‌త్‌పై ఎప్పుడూ అవాకులు..చెవాకులు పేలే పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్‌,  కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా స్వ‌యంగా త‌నే వెల్ల‌డించాడు. నాలుగైదు రోజులుగా ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో  ప‌రీక్ష‌లు చేయించుకుంటే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లుగా వివ‌రించాడు. దేవుడు దయతలిస్తే తొందరగా కోలుకుంటాను. నాకు మీ ప్రార్థనలు కావాలి’ అంటూ అభిమానుల‌ను వేడుకున్నాడు. కరోనా ప్రభావం పాకిస్తాన్‌లో తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో అతను తన ఫౌండేషన్‌ ద్వారా పలు సహాయక కార్యక్రమాలు చేపట్టాడు. క‌రోనా మొదలైన నాటి నుంచి త‌న ఫౌండేష‌న్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు అంద‌జేస్తున్నాడు.

 

 వాస్త‌వానికి ముందు నుంచి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని నేను ఊహిస్తూనే ఉన్నానే. చివ‌రికి నేను ఊహించిందే జ‌రిగింది అంటూ ఆఫ్రిది త‌న‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంపై స్పందించారు. దేశంలోని మూలమూలలకు స్వయంగా వెళ్లి పేదలకు ఆహారం, ఇతర వస్తువులు అందజేయడంలో చురుగ్గా పాల్గొన్నందుకు త‌న‌కు మాత్రం చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పాడు. 40 ఏళ్ల అఫ్రిది పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరైనా అతను క్రికెట్‌లో ఇంకా చురుగ్గానే ఉన్నాడు. మార్చిలో జరిగిన పాకిస్తాన్‌ టి20 సూపర్‌ లీగ్‌లో అతను పాల్గొన్నాడు. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో రెండు నెల‌ల కింద‌ట‌ అఫ్రిది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటించాడు. 

 

ఆ స‌మ‌యంలో అక్కడి స్థానికులతో మ‌మేక‌మై  భారత్‌పై తనకున్న విద్వేషాన్ని చాటుకున్నాడు. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేసిన విష‌యం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఉద్దేశించి భారత ప్రధాని మోదీ, భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌‌ సైనిక బలం 7 లక్షలు కాగా.. అంతమంది భారత సైనికులను మోదీ కేవలం కశ్మీర్‌లోనే మోహరించారు. మీ అందమైన గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నా. చాలా కాలం నుంచి మీ అందరిని కలవాలనుకుంటున్నా. ప్రపంచం కరోనా అనే మహమ్మారితో పోరాడుతుంది. కానీ నరేంద్ర మోదీ మనస్సులో దానికి మించిన వ్యాధి ఉంది'అని వ్యాఖ్యానించాడు. కశ్మీర్ కోసం గత 70 ఏళ్లుగా పాకిస్థాన్ బిచ్చమెత్తుకుంటుందని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: