అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ చేజార్చుకోవటంతో స్వంత గడ్డపై పరువు పోయింది.  చూడటానికి పెద్ద లక్ష్యమూ కాదు.. ఆడటానికి అనువుగాలేని పిచ్ కూడా కాదు.. కాస్త నిలబడితే చాలు పరుగులు వాటంతట అవే వచ్చే పరిస్థితుల్లో విరాట్ వీరులు అలసత్వం చూపెట్టారు. సొంతగడ్డ అన్న ధీమానో.. లేక ఆసీస్‌లో స్టార్లు లేరన్న హేళనోగానీ.. చేజేతులా వన్డే సిరీస్‌ను చేజార్చుకున్నారు.

Rohit-Sharma

దీనికితోడు ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన ఏ ప్రయోగం ఫలించకపోగా.. తుది కూర్పు అంచనాలన్నీ తారుమారయ్యాయి. మరోవైపు సమిష్టితత్వానికి నిదర్శనంగా నిలిచిన కంగారూలు.. సొంతగడ్డపై తమకు ఎదురైన వరుస పరాజయాలకు ఘనమైన ప్రతీకారం తీర్చుకున్నారు. ఉస్మాన్ ఖవాజ(106 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగిన వేళ.. కోట్లా కొట్లాటలో మొనగాళ్లుగా నిలిచి సిరీస్‌ను ఎగురేసుకుపోయారు.  బ్యాటింగ్ వైఫల్యంతో ఓ మోస్తరు స్కోరును ఛేదించలేక టీమ్‌ఇండియా చతికిలపడింది. దీంతో బుధవారం జరిగిన ఐదో వన్డేలో ఆసీస్ 35 పరుగుల తేడాతో విరాట్‌సేనపై గెలిచింది.

Adam-Zampa

ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్నది. 2015 తర్వాత స్వదేశంలో భారత్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి కాగా, సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉండి కూడా సిరీస్‌ను చేజార్చుకున్న తొలి జట్టుగా టీమ్‌ఇండియా రికార్డులకెక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజ (106 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, హ్యాండ్స్‌కోంబ్ (60 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. తర్వాత భారత్ 50 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (89 బంతుల్లో 56; 4 ఫోర్లు), కేదార్ జాదవ్ (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్), భువనేశ్వర్ (54 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేసినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఖవాజకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: