భారత్ డేరింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ రిటైర్ మెంట్ ప్రకటించారు. దీనితో భారత క్రికెట్ అభిమానులు తీవ్ర బాధలో ఉన్నారని చెప్పాలి.  భారత క్రికెట్ జట్టు గత ఇరవై సంవత్సరాల్లో సాధించిన గొప్ప విజయాలు ఏవో చెప్పమంటే ఫ్యాన్స్ ప్రధానంగా రెండు మూడు విజయాలను ప్రస్తావిస్తారు. అందులో ఒకటి 2011 ప్రపంచకప్ ను టీమిండియా నెగ్గడం. రెండోది అంతకన్నా ముందు 2007లో టీ20 ప్రపంచకప్ ను నెగ్గడం. మరికొన్ని మరపురాని విజయాలు ఉన్నా.. ఈ రెండు ట్రోఫీల్లో టీమిండియా ప్రపంచ విజేతగా నిలవడం మాత్రం చరిత్రాత్మకం. అలాంటి చరిత్రాత్మక ఘట్టాల్లో అత్యంత కీలకపాత్ర పోషించిన క్రికెటర్ యువరాజ్ సింగ్. తను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టుగా యువరాజ్ ప్రకటించడంతో.. ఇండియన్ క్రికెట్లో ఒకశకం ముగిసింది అని చెప్పవచ్చు.


ఆధునిక ప్రపంచ క్రికెట్లో మేలిమి ప్లేయర్లలో యువీ ముందు వరసలో ఉంటాడు. మూడు వందలకు పైగా వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం, ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం ద్వారా యువరాజ్ క్రికెట్ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. వ్యక్తిగతంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్లలో యువీ కూడా ముందు వరసలోనే ఉంటాడు. రెండేళ్ల నుంచి జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి వివిధ ప్రయత్నాలు చేసిన యువరాజ్ ఇక ఆ అవకాశం రాదని గ్రహించి అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించాడు. ఈసారి ప్రపంచకప్ లో ఆడాలని యువరాజ్ చాలా కలలు కన్నాడు.


అయితే యువీకి ఆ అవకాశం దక్కలేదు. యువ ఆటగాళ్లతో పోటీ పడలేకపోయాడు ఈ ముప్పై ఏడేళ్ల క్రికెటర్. ఇక దేశవాళీ, ఐపీఎల్ లలో కూడా యువరాజ్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. అక్కడా అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. దీంతో యువరాజ్ సింగ్ క్రికెట్ కు ఆటగాడిగా వీడ్కోలు పలికాడు. ప్రధానంగా వన్డే ప్లేయర్ అయిన యువరాజ్ కెరీర్ ఆరంభం నుంచి అనేక చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యేకించి సీమ్ బౌలర్లను ఎదుర్కొనడంలో యువరాజ్ టచ్ అందరికీరాదు. ఆరు బంతులనూ సిక్సులుగా కొట్టిన వీరాధివీర క్రికెటర్లలో యువరాజ్ ఒకడు. అత్యంత అరుదైన ఆ ఫీట్ ను అంతర్జాతీయ టీట్వంటీలో సాధించి యువరాజ్ చరిత్రలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: