పెద్దలకు మాత్రమే.... ఈ వాక్యం ప్రస్తుత జెనరేషన్ కు పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అందరూ అడల్ట్ ఆడియన్సే కాబట్టి.  ఎలాగంటారా అడల్ట్ కంటెంట్ అన్నది సినిమా కై ఎక్కువగా వాడేది.  కాని కాలక్రమేణా ఈ మార్కు అన్ని మాధ్యమాలలో హెచ్చరికగా చూపెడుతున్నారు. అంతకన్నా ఎక్కువగా వాడుకుంటున్నారు అని చెప్తే ఇంకా బాగుంటుంది. ఆగండాగండి ఇదేదో హితబోధఅని ఈ ఆర్టికల్ చూడడం మానేస్తే మీ పిల్లల నేటి పరిస్థితి పై మీకు కొంత మేర తెలియకపోవచ్చు.

మితిమీరిన శృంగార సన్నివేశాలు,  జుగుప్సతో కూడిన హింస 18 ఏళ్ళ లోపు వారు చూడకూడదని చట్టబద్దమైన రూపొందించి హెచ్చరిక ప్రస్తుతం రాతప్రతులలో రాతిఫలకంగానే మరుగున పడిపోయింది.  పై సూచనను పాటించాల్సిన యువత కాని పాటింపచేయాల్సిన పాలకులు గాని అసలాంటి సూచన వున్న విషయం కూడా సామరస్యంగా మరిచిపోయారు.  స్మార్ట్ ఫోన్ నుండి సినిమా వరకు అందరికీ సకలం అందుబాటులో వున్న నేటిరోజుల్లో పెద్దలకు మాత్రమే హెచ్చరికను కొంచెం మార్చి చిన్నాపెద్దలకు మాత్రమే అని మార్చే రోజులొచ్చాయి.  స్మార్ట్ ఫోన్, సినిమా అన్నది కాసేపు పక్కనపెడితే ప్రతి ఇంట్లో ఇరవైనాలుగ్గంటలు మోగే టీవి మరింత ప్రమాదకారంగా మారింది.

ఈ రోజుల్లో టీవి అన్నది ఇంట్లో అందరికీ అవసరం. వయసు పైబడిన పెద్ద వాళ్ళనుండి చదువుకొనే చిన్న పిల్లల వరకు ప్రతిఒక్కరూ కలిసి చూసే వినోద మాధ్యమం.  టీవి లో వచ్చే కార్యక్రమాలు ఎలా వున్నా అవరోధం లేకుండా చూసే అవకాశం.  ఉదాహరణకు ఓటీవి ఛానెల్ లో ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాలు చూద్దాం. పేరుకు హాస్యంశంతో కూడుకున్న ఓ కార్యక్రమంలో యాంకర్ నుండి పాత్రధారులు, ఆఖరికి జడ్జీలతో సహా అడల్ట్ సినిమా కన్నా ఎక్కువ మోతాదులో దుస్తులు, భాష వాడి చూసే ప్రేక్షకులను పెడదోవపట్టిస్తున్నారు.  కార్యక్రమనిర్వాహకులను ఈ విషయంలో మనం దోషి అనలేం ఎందుకంటే ఆ కార్యక్రమం పది మంది పొట్ట నింపుతుంది కాబట్టి.  కాని చూసే మనం మన చుట్టూ వున్న కుటుంబసభ్యులతో ఎలా చూడగలుగుతున్నాం అనేది అర్ధం చేసుకోవాలి. ఒక ఇంట్లో ఎదిగొచ్చిన బిడ్డలతో తల్లిదండ్రులు, ఇంటికొచ్చిన కోడలితో అత్తమామలు, ఇలా చెప్పుకుంటూ పోతే సకుటుంబ సపరివార సమేతంగా ఓఅసభ్య కార్యక్రమం కలిసి చూస్తున్నాం. గంటన్నరసేపు చూసే ఆ కార్యక్రమంలో ఎన్నో బూతులు, రోతలు దొర్లినా బుద్దిగా సిగ్గుతో కుచించుకుపోయి చూస్తున్నాం. ఒక్క ఈ కార్యక్రమమే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ఈ విశ్లేషణ ఉద్దేశం ఆ కార్యక్రమాల్ని వేలెత్తి చూపడం కాదు, చూసేవారిని ఆలోచింపజేయడం. 

ఒక్కసారి ఆలోచించండి... గజిబిజిగా సాగే ఈ గందరగోళ జీవితంలో వినోదమనే ఆటవిడుపు ప్రతి ఒక్కరి అవసరం.  కాని ఆ అవసరం  యువతకు అవకాశంగా మరకూడదు.   చేతిలో స్మార్ట్ ఫోన్ ని అయితే కట్టడి చేయలేం కాని చేతిలోని రిమోట్ తో మన పిల్లల భవిష్యత్తును మార్చొచ్చేమో కాస్త ఆలోచించండి.  ఎందుకంటే టీవి కార్యక్రమం కావాలంటే రిపీట్ లో చూడొచ్చు, కాని పిల్లలు వేసే ప్రతి అడుగు మళ్ళీ మార్చలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: