పచ్చని పైర్లు, కొబ్బరి తోటలు, గలగలపారే గోదావరి, సొగసుగా సాగే కాలువలు, గోదావరి - సాగర సంగమం.. ఇలా, ఎన్నో అందాలు కోనసీమ సొంతం. స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేకాదు, కోనసీమ సాంప్రదాయాలు, మర్యాదలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.... ఇదీ దూరం నుండి చూసేవారికి కనపించే కోనసీమ సీన్‌... కానీ,

ఈ అందాల వెనుక సహజ వనరుల ధ్వంసం ఉంది. నేలంతా కలుషితమై ఇక్కడ 40 గ్రామాలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాల్లో , ఆక్వా చెరువుల వల్ల భూగర్భ జలాలు ఉప్పగా మారుతున్నాయని స్థానికులు లబో దిబో మంటున్నారు.
ఉప్పలగుప్తం మండలం ఎస్‌.యానాంలో ఆక్వా చెరువుల వల్ల నీరు ఉప్పుగా మారుతోంది. ఇక్కడ కెయిర్న్‌ ఎనర్జీ, వేదాంత సంస్థలు రెండురోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాయి. సముద్రంలో చమురు, గ్యాస్‌ వెలికితీస్తున్న ఈ సంస్థలు తమకు చాలినంత నీరు సరఫరా చేయడంలేదని ఎస్‌.యానాంకు చెందిన ప్రజలు అంటున్నారు.

చల్లపల్లిలోనూ తాగునీటి సమస్య ఉంది. అల్లవరం మండలం కొమరిగిరిపట్నం, ఓడలరేవు గ్రామాల్లో చేపల చెరువుల కారణంగా భూగర్భ జలాలు కలుషితమై ఉప్పునీరు వస్తోందని, వేసవిలో తాగునీటి సమస్య అధికంగా ఉంటుందని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కాట్రేనికోన మండలంలో ఆక్వా చెరువుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.

అమలాపురంలో ఆక్వా 400 ఎకరాల్లో విస్తరించింది. దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. బావుల్లో నీరు తాగడానికి పనికి రాకుండా పోవడంతో, ఈ ప్రాంతంలో దాదాపు 120కి పైగా ఆర్వోప్లాంట్‌లు నీటిని అమ్ముతున్నాయి.

'' మూడు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో బావుల్లో నీరు కొబ్బరి నీళ్ల లా ఉండేవి. ఇపుడు కొబ్బరి నీళ్లు కూడా రుచిని కోల్పోయాయి. ఏ గ్రామంలో చూసినా మినరల్‌ వాటర్‌ టిన్‌లు కొనుక్కొని తాగుతున్నారు. ఓఎన్‌జీజీ బావుల వల్ల, పంటపొలాలు చేపల చెరువులుగా మారడం వల్ల నేలంతా కలుషితం అయి పోయింది... ప్రభుత్వం పట్టించుకోవాలి.'' అని సత్తిబాబు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: