కూకట్ పల్లికి చెందిన ఒక వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఓ రోజు బిజీగా ఉన్న సమయంలో గుర్తు తెలియని నెంబరు నుంచి అతడికి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. సార్ నమస్తే దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్ అంటూ అవతలి వ్యక్తి వినమ్రంగా విధేయుడిగా మాట్లాడాడు. రమేష్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రశ్న సమాధానం అతడి అన్నట్లుగా స్టోరీ వినిపించాడు.సార్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ లో నా ఫోన్ నెంబర్ బదులు పొరపాటుగా మీ నెంబర్ రాశాను.


ఇద్దరిదీ ఒకే రకమైన నెంబరు కావడంతో పది అంకెలలో ఒక అంకెను తప్పుగా రాశాను.నా జాబ్ ఆఫర్ మెసేజ్ మీకు వచ్చిందని తెలిసింది. రిజిస్టర్ నెంబరుకు మాత్రమే మెసేజ్ వస్తుందని కంపెనీ వారంటున్నారు. ఆ మెసేజ్ చూపించమంటున్నారు అంటూ ప్లీజ్ అన్న కాస్త ఆ మెసేజ్ నా నెంబర్ కు ఫార్వర్డ్ చేయమన్నాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హుందాగా కన్విన్సింగ్ గా మాట్లాడాడు. క్షణాల్లో ఇదంతా జరిగి పోయింది. ఇది విన్న వ్యక్తి, పని బిజీలో మెసేజ్ ను చదువుకోకుండానే అతడి నెంబర్ కు ఫార్వార్డ్ చేశాడు. ఆ మెసేజ్ అపరిచిత వ్యక్తికి ఫార్వర్డ్ చేసిన క్షణాల్లోనే అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న 90,000 రూపాయలు మాయమయ్యాయి.


ఆఫీసులో పని ముగించుకొని ఇంటికి వెళ్లిన రమేష్ ఫోన్ చెక్ చేస్తుండగా మధ్యాహ్నం అపరిచిత వ్యక్తి ఫోన్ సంభాషణ గుర్తొచ్చింది. వెంటనే మెసేజ్ ను పరిశీలించాడు. అది చదివిన రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది ఉద్యోగానికి సంబంధించిన మెసేజ్ కాదు. తన బ్యాంకు ఖాతా నుంచి వచ్చిన ఓటీపీ నెంబర్ ఖంగుతిన్న రమేష్ భయపడుతూనే దాని వెనుక ఉన్న మరో మెసేజ్ ను చదివాడు. అతను అనుకున్నదే నిజమైంది. తన బ్యాంక్ ఖాతాలో ఉన్న 90,000 రూపాయలు మరో ఖాతాలో బదిలీ అయినట్లు గుర్తించాడు.

అపరిచిత వ్యక్తికి మెసేజ్ చేసినా ఒక్క నిమిషంలోనే డబ్బులు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వర్క్ బిజీలో ఉండి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు తిరిగి అపరిచిత వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. సైబర్ క్రైం పోలీసులను కలిసి జరిగింది చెప్పగా అది సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసమని చెప్పారు. ఫిర్యాదు చేసి వెనుదిరిగాడు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు సరి కొత్త పంథాలో మోసాలకు తెగబడుతున్నారు.



ఒకే రకమైన మోసాన్ని రకరకాలుగా చేస్తున్నారు. సైబర్ నేరాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్న విద్యావంతులు సైతం బురిడీ కొట్టిస్తున్నారు. తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి తమకు కావలసిన సమాచారం తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత క్షణాల్లోనే బ్యాంక్ ఖాతాలోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: