కంప్యూటర్‌ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖితమయింది. అనూహ్య వేగంతో గణనలను పూర్తి చేసే అద్భుత చిప్‌ను గూగుల్‌ సంస్థ ఆవిష్కరించింది. సంప్రదాయ సూపర్‌ కంప్యూటర్లకు వేల ఏళ్లు పట్టే లెక్కలను క్వాంటమ్ సుప్రిమసీ కేవలం కొద్ది సెకన్లలోనే పూర్తి చేస్తుంది.


క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో గూగుల్‌ సంస్థ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. సూపర్‌ కంప్యూటర్లను మించిన వేగంతో పని చేసే అత్యాధునిక 'సికమోర్‌' చిప్‌ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్‌ 10 వేల ఏళ్లలో పూర్తి చేసే గణనను ఈ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ చిప్‌ కేవలం 200 సెకన్లలో పూర్తిచేసినట్లు గూగుల్‌ తెలిపింది. తాజా ఆవిష్కరణను 'క్వాంటమ్‌ సుప్రిమసీ'గా అభివర్ణించింది. సాధారణ కంప్యూటర్లు బైనరీ సంఖ్యల ఆధారంగా డేటా ప్రక్రియలను నిర్వహిస్తాయి. కానీ.. సికమోర్‌ చిప్‌ బైనరీ సంఖ్యలతోపాటు 54క్యూబిట్స్‌తో కూడిన క్వాంటమ్‌ ప్రాసెసర్‌ ఆధారంగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిప్‌లో ప్రతి క్యూబిట్‌ మరో నాలుగు క్యూబిట్‌లతో అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా గణన ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతుందని గూగుల్‌ కృత్రిమ మేధ శాస్త్రవేత్త జాన్‌ మార్టిన్స్‌ తెలిపారు. 


వాస్తవానికి గూగుల్‌ 'క్వాంటమ్‌ సుప్రిమసీ'కి సంబంధించిన కొన్ని వివరాలు గత నెల్లోనే బయటకొచ్చాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో విస్తృత పరిశోధనలు కొనసాగిస్తున్న ఐబీఎం సంస్థ సికమోర్‌ చిప్‌ పనితీరుపై సందేహాలు వెలిబుచ్చింది. చిప్‌ పనితీరును మరీ ఎక్కువ చేసి చెప్తున్నారని ఆరోపించింది. 'సికమోర్‌' 200 సెకన్లలో చేసే గణనలను సంప్రదాయ ప్రాసెసర్లతో కూడిన కంప్యూటర్లు రెండున్నరేళ్లలో పూర్తిచేయగలవని అభిప్రాయపడింది. మరోవైపు క్వాంటమ్ సుప్రిమసీ వీలైనంత తొందరగా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలుపుతోంది. మీరి ఈ సూపర్ కంప్యూటర్ ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకురానుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: