ఆధార్.. దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి దాదాపు ఉన్న కార్డు ఇది. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతూనే ఉన్నాయి. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎన్ని ఉపయోగాలు చెప్పక్కర్లేదు. అయితే ఈ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే.. కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే. ఆధార్ చుట్టూ ఇప్పుడు ఎన్నో అనుమానాలు... బ్యాంక్ అకౌంట్ మొదలు.. ఏది కొనాలన్నా ఆధార్ తప్పనిసరైంది. ఇక ఈ కార్డు ఒకవేళ పోగొట్టుకుంటే.. ఇక ఆధార్ ఎన్‌రోల్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిందే. అయితే ఇక నుంచీ ఆధార్ కార్డుకు సంబంధించిన సేవల కోసం పదేపదే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ప‌ని లేదు. 

 

ఎందుకంటే ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు mAadhaar యాప్‌ రూపొందించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.  ఇటీవల ఈ యాప్‌ను అప్‌డేట్ కూడా చేశారు. మరి ఈ యాప్‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.  ఎంఆధార్ యాప్‌ను 13 భాషల్లో ఉపయోగించొచ్చు. అందులో 12 భారతీయ భాషలు కాగా, మరో భాష ఇంగ్లీష్. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్, మళయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒడియా, అస్సామీ, బెంగాలీ భాషల్లో ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది. ఇంగ్లీష్‌లో టైప్ చేస్తేనే ఇతర భాషల్లో కనిపిస్తుంది. ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

 

రీప్రింట్, అడ్రస్ అప్‌డేట్, ఇకేవైసీ డౌన్‌లోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ / ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి సేవలుంటాయి. మొత్తం 35 రకాల సేవలు ఒకే యాప్‌లో పొందొచ్చు. ఈ యాప్ ద్వారా ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. మీరు మర్చిపోయిన ఆధార్ నెంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీని తిరిగి పొందొచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే ఎంఆధార్ యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. ఇక ఇందులో మరో కీలకమైన ఫీచర్ ఏంటంటే... రైల్వే ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణించేప్పుడు ఐడీ ప్రూఫ్‌ను ఎంఆధార్ యాప్ ద్వారా చూపించొచ్చు. ఎయిర్‌పోర్టులో కూడా ఎంఆధార్ యాప్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా చూపించొచ్చు. 

 

 

 

 


  
 

మరింత సమాచారం తెలుసుకోండి: