హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. అక్టోబరు 11, 12 తేదీల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ 31వ అంతర్జాతీయ సదస్సు జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్ ఐఐటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సంయుక్త భాగస్వామ్యంతో తెలంగాణ పరిశ్రమలశాఖ ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సు నిర్వహణ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీవో) పొందుపరిచింది.  హ్యుమనైజింగ్ డిజైన్ కాన్సెప్ట్‌తో జరిగే సదస్సులో మూడు థీమ్‌ల పేపర్లు, పోస్టర్లను సమర్పించేందుకు ఔత్సాహికులను డబ్ల్యూడీవో రీసెర్చ్, ఎడ్యుకేషన్ ఫోరం ఆహ్వానిస్తోంది.


హైదరాబాద్‌లో నిర్వహించనున్న వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సదస్సులో.. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకొనే విధానాన్ని మొదటి థీమ్‌గా చర్చిస్తారు. ప్రపంచం ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలు, వాటి పరిష్కారాల్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తారు. ప్రపంచవ్యాప్త విద్యార్థులు, యువ డిజైనర్ల అవసరాలు, మారుతున్న ఆలోచనలు, ఆకాంక్షలపై దృష్టి సారిస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పీహెచ్‌డీ వరకు వివిధ స్థాయిల్లో వస్తున్న మార్పులను చర్చిస్తారు. రెండో థీమ్‌లో భాగంగా.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ విద్య రూపాంతరం చెందుతున్న విధానంపై చర్చలు జరుపుతారు. 


వాస్తవానికి, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో 1980 దశకంలోనే విశ్వవిద్యాలయ స్థాయిలో పారిశ్రామిక డిజైనింగ్ ప్రోగ్రాములు ప్రారంభమయ్యాయి. రెండు దశాబ్దాల ప్రపంచీకరణ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య డిజైన్‌కు సంబంధించి పోటీతత్వం పెరిగింది. సరైన వనరుల కొరత కారణంగా అంతర్జాతీయ డిజైన్ విద్య కార్యక్రమాలు అనుకున్నంత వేగంగా విస్తరించలేదు. డిజైన్ పరిశోధన, విద్య ప్రధాన సవాళ్లు, అవకాశాలతోపాటు డిజైన్ విద్యను పునర్నిర్వచించడానికి పరిశోధన ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి ఈ సదస్సులో ప్రయత్నిస్తారు. డిజిటల్ మీడియా అభివృద్ధి చెందుతున్న విధానంపై మనం ఎలా మారుతున్నామనే అంశాన్ని మూడో థీమ్‌గా ఎన్నుకొన్నారు. ప్రస్తుత విద్యావ్యవస్థ అభివృద్ధి చెందటానికి అవసరమయ్యే సరికొత్త విధానంపై ఆలోచనలు, డిజైన్లను ఈ సదస్సు ఆహ్వానిస్తున్నది. హైదరాబాద్ వేదికగా వరల్డ్ డిజైన్ అ సెంబ్లీ అంతర్జాతీయ సదస్సు జరుగుతుండ టం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ హర్షం వ్యక్తంచేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: