శక్తికి మారుపేరు స్త్రీ అందుకే ఆమెను ప్రేమమయి అన్నారు. ఆడదంటే మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమామృతాన్ని పంచి ఇచ్చిచ్చే అమృతమూర్తి. మనసు స్పందించే సంఘటనలకి కదిలిపోయి కరిగి కన్నీరయ్యే కరుణామూర్తి కూడా స్త్రీ నే... కాని నేటి కాలంలో శారీరక కోరికలు తీర్చుకునే పురుషుడి పశుబలానికి  నలిగిపోయే పువ్వులా మారింది.  సృష్టి జీవన గమనానికి చిరునామగా మారి. అమ్మలా లాలిస్తూ, చెల్లిలా అనుబంధాన్ని పంచుతూ, భార్యలా జీవితాంతం అండగా ఉండే స్త్రీమూర్తి దిక్కు తోచని పక్షిలా ఒంటరిగా ఈ సమాజం నడి మధ్యన నిలబడి పక్షిలా మూగగా రోదిస్తుంది. మృగాళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకుని దయనీయంగా తనువు చాలిస్తోంది.

 

 

వీధిలో అడుగుపెడితే చాలు, వెటకారంగా వెంటాడే చూపులు, ద్వంద్వార్థాల మాటల గాయాలు, వంకర నవ్వులు. ఇలా అన్నిటిని భరిస్తూ ఉన్న ఆమెలో మాతృత్వపు భావనలు ఎరుగని తోడేళ్లూ పైశాచికంగా చిత్రవధ చేసి, అంతమొందిస్తున్నారు. ఒంటరి మహిళలను, అభం శుభం తెలియని అమాయక చిన్నారులను తమ పశువాంఛకు బలి చేస్తున్నారు. మనతో పాటే ఉంటూ ఇలాంటి దారుణాలకు పాల్పడే మృగాళ్లు ఉన్నారనే విషయం సభ్యసమాజంలోని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

ఒకప్పుడు అమ్మ వెనకే కొంగుపుచ్చుకుని తిరిగిన చిట్టిపాప. బడిలో తోటి స్నేహితురాల్ని అంటిపెట్టుకొని అడుగులు వేసిన బిత్తర చూపుల చిన్నారి. వయసుపూదోటలో అందం హరివిల్లయి రంగులు విరజిమ్ముతున్న యవ్వనంలో కామాంధుల చూపుల గాలంలో చిక్కుకున్న విల విలలాడుతున్న చేపపిల్లలా మారుతుంది. మోహం చాటున మోసం ఉందన్న విషయాన్ని గుర్తించక మగ కుక్కల చేతిలో చిరిగిన విస్తారులా మారుతుంది. ఎందరో రోజు రోజుకు అమాయక ఆడపిల్లలు, మహిళలు  అదృష్యం అవుతున్నారు. ఈ సమస్య ఒక్క రాష్ట్రానికే  చెందింది కాదు. ఒక నగరానికే పరిమితమైంది కాదు.

 

 

ప్రతి గ్రామంలో ప్రతి ప్రదేశంలో వేటగాళ్లలా మాటువేసి జింకపిల్లలను వేటాడినట్లుగా ఆడపిల్లలను వేటాడటం మొదలు పెడుతున్నారు.  ఇలా ఎంతో మంది బాలికలు, మహిళలు ఇప్పటివరకు ఆచూకి లేకుండా పోయారు. మరికొంతమంది దూర్బరమైన జీవనాన్ని సాగిస్తూ బ్రతుకుతున్నారు. లొంగిన వారిని పశువులా అనుభవిస్తూ లొంగని వారిని మృగంలా హతమారుస్తున్నారు. మగపశువు నీడలో లేడిపిల్లలా మారిన ఆడపిల్ల భయంతో దిక్కులు చూస్తూ బ్రతుకుంది నేటి సమాజంలో ఈ పరిస్దితి ఇలాగే కొనసాగితే ముందు ముందు అమాయిలకోసం గూగుల్లో వెతకవలసి వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: