అంటే మరేమో అప్పట్లోనే మనకున్న బద్దకంతో "ఆ తొందరేముంది మెల్లగా పుడదాంలే, ఐనా ఇక్కడే హాయిగా ఉందమ్మా" అని డ్యూ డేట్ దాటినా కూడా ఎంచక్కా వెచ్చగా అమ్మ బొజ్జలో బజ్జునుంటే ఓ పదిరోజులు ఓపికగా ఎదురు చూసిన మా డాక్టరాంటీ "ఇక నే కలుగజేస్కోకపోతే కుదరదమ్మా" అనేసి నన్ను భూమ్మీదకి తెచ్చేశారని ఇదివరకే చెప్పాను కదా. నా ఆ బద్దకానికి మూల్యంగా నేను రంగు తగ్గిపోవడంతో సహా మరికొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చేవట నా చిన్నప్పుడు. అలాంటి వాటిలో ముఖ్యమైనది బలం లేకపోవడమట. 

 

అసలు ఆహారంపై శ్రద్ద లేకపోవడం. ఏం పెట్టినా తినకపోవడం, ఎన్ని తంటాలు పడి ఎంత తినిపించినా బొత్తిగా బలం రాకపోవడం ఊసకాళ్ళు బలహీనమైన అవతారంతో అమ్మ వాళ్ళని భయపెట్టేవాడినట.నాతో పాటు పుట్టిన పిల్లలు నడిచేస్తూ పరిగెడుతూ అల్లరి చేస్తుంటే నేను ఊరికూరికే ఎక్కడపడితే అక్కడ కూలబడిపోవడంతో ఇలా ఐతే పిల్లాడేమైపోతాడు అని అమ్మకి బోలెడంత బెంగొచ్చేసి అర్జంట్ గా ఓ పిల్లల డాక్టర్ గారి దగ్గర చూపించేసిందట. 

 

అప్పుడు ఆయనేమో "ఇలా కాదమ్మాయ్ మీ వాడికి తిండి పుష్టి కలగడానికి మాంచి మందిచ్చేస్తాను, ఆ టానిక్ గానీ తాపావంటే ఇక కొండలని పిండి చేసుకుని తినేస్తాడు, బోలెడంత బలం వచ్చేస్తుంది" అని చెప్పి ఓ టానిక్ ఇచ్చారుట అది క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడాక ఇహ అప్పుడు మొదలైంది మన తిండి ప్రస్థానం మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే లేదు. 

 

అప్పటిదాకా నా చేత అన్నం తినిపించడం అంటే ఓ చిన్న సైజ్ యజ్ఞం చేయడమేనట. అమ్మో పిన్నో నన్ను ఎత్తుకుని నానా రకాల మాయలు చేసి కథలు చెప్పి, ఆటలు ఆడించి, పాటలు పాడి, చందమామను చూపిస్తూ ప్రపంచంలో ఉన్న ఇతరత్రా ఫీట్స్ అన్నీ చేసేవారట. ఇన్ని చేసినా కూడా మెత్తగా ఉడికిన అన్నంలో పప్పు నెయ్యి వేసి బాగా కలిపి కంచం అంచుకి రాసి గుజ్జు తీసి గోరుముద్దగా అందిస్తే (ఇది ఇప్పటికీ ఇష్టమే అనుకోండి) అది మాత్రమే తినే వాడినట. కానీ ఆ టానిక్ వాడిన తర్వాత నా ధోరణి మొత్తం మారిపోయిందని చెప్పేది అమ్మ. 

 

సో ప్రేమ కొద్దీ పాపం బిడ్డ ఏమైపోతాడో అని కష్టపడి తిండి మీద ఇష్టం పెంచిన అమ్మ దాన్ని చక్కగా అలాగే పెంచి పోషిస్తూ వచ్చేది. నేను ఒకటి నుండి నాలుగో తరగతి వరకు మా ఇంటిపక్క బడిలో అంటే మా కిటికీలో నుండి చూస్తే తరగతి గదిలో నేనేం చేస్తున్నానో కనిపించేంత పక్కనే చదివినా కానీ నాకు ఇంటర్వల్ లో కొనుక్కోడానికి పదిపైసలో పావలానో ఇచ్చేది. ఆ పైన అదే బడిని కొంచెం దూరంగా మార్చాక అది పెరిగి నేను తరగతులు పెరిగే కొద్దీ డబ్బులూ పెరుగుతూ వచ్చాయ్. 

 

మా స్కూల్ లో దొరికే వాటికన్నా ఇంటి దగ్గర కొండయ్య కొట్టు అని ఒకటి ఉండేది. అందులో పదిపైసల బిళ్ళ సైజ్/షేప్ లో ట్రాన్సపరెంట్ రేపర్ లో చుట్టి  న్యూట్రిన్ వాళ్ళ కొబ్బరి చాక్లెట్ ఒకటి వచ్చేది అది నా ఫేవరెట్. అలాగే పప్పుండలు, కొబ్బరుండలు, కొబ్బరి బిళ్ళలు, చాక్లెట్లు, బిస్కట్లు, చిన్న చిన్న చిరుతిళ్ళు చాలా దొరికేవి అందుకే ఆ కొట్టుకి నేను రెగ్యులర్ కస్టమర్ ని అనమాట. 

 

ఇవే కాక కొన్నాళ్ళు గుంటూరు నుండి నర్సరావుపేట మధ్య అమ్మ సీజన్ తిరిగేప్పుడైతే స్టేషన్ లో మెలోడీ చాక్లెట్స్ కొని తీస్కురావాల్సిందే. అవి లేకుండా వస్తే నా ఏడుపు మొహం చూడలేక నాకోసం కొంచెం ముందుగానే స్టేషన్ కి వచ్చి రైలు అందుకోవడం కన్నా ఈ చాక్లెట్స్ కొనడం మీద ఎక్కువ శ్రద్ద చూపించేదిట అమ్మ. ఆ స్టేషన్ లోనే కొన్ని వెరైటీ బిస్కట్లు, ఎపుడైనా ప్రత్యేకమైన చాక్లెట్లు, ఇంకా చందమామ, బాలమిత్ర, బుజ్జాయి లాంటి పుస్తకాలు కూడా తెచ్చేది.   

మరింత సమాచారం తెలుసుకోండి: