తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌భుత్వాలు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్ల‌ను గుర్తించిన అధికారులు ఆ కార్యాచ‌ర‌ణ చేప‌డుతున్నారు. అయితే.. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 381కి చేరింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 18 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రెండేసి కేసులు చొప్పున కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఇక‌ కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 77కు చేరింది. ఆ త‌ర్వాత‌ గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు 58కి పెరిగాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 365 యాక్టివ్‌ కరోనా పాజిటివ్‌ కేసులున్నాయి.

ఇక‌ 10 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ఆరుగురు మరణించారు. 24 గంటల వ్యవధిలో 892 శాంపిళ్లు పరిశీలించగా కేవ‌లం 17 కేసులు పాజిటివ్‌గా, 875 కేసులు నెగిటివ్‌గా తేలినట్లు హెల్త్‌ బులెటిన్‌లో అధికారులు పేర్కొన్నారు. క‌రోనా బాధితుల నివాస ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పేషెంట్ల‌తో సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారు నివసిస్తున్న ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. ఇక‌  తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 487కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారు.  కరోనా నుంచి 45 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: