భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి మ‌రో మ‌లుపు తిరుగుతుందా..?  భార‌త్‌కు ఊహించ‌ని షాక్ త‌ప్ప‌దా..?  ప‌ట్ట‌ణాల నుంచి సొంతూళ్ల‌కు వ‌ల‌స కూలీల త‌ర‌లింపుతో కొత్త చిక్కులు త‌ప్ప‌వా..? అంటే ప‌లువురు విశ్లేష‌కులు మాత్రం ఔన‌నే అంటున్నారు. అనేక రాష్ట్రాల నుంచి వ‌ల‌స కార్మికులు, కూలీల‌ను సొంతూళ్ల‌కు నిన్న‌టి నుంచి త‌ర‌లిస్తున్నారు. అయితే.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వ‌ల‌స కూలీలకు క‌రోనా సోకింది. ఇది పెద్ద షాకేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి బస్సుల్లో తరలించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీల్లో ఏడుగురికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఉత్తరప్రదేశ్‌లోని బస్తి జిల్లా మెజిస్ట్రేట్ అశుతోష్ నిరంజన్ తెలిపారు. మహారాష్ట్రలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొన్న‌ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మహారాష్ట్రలో ఉన్న వలస కూలీలను ఉత్తరప్రదేశ్‌కు అక్కడి స్థానిక ప్రభుత్వం తరలించింది.

 

మధ్యప్రదేశ్‌లోని ఝాన్సీ మీదుగా వీరిని తరలించారు. అయితే బస్తి చేరుకున్న వీరికి కోవిడ్-19 టెస్టులు చేయగా ఏడుగురికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్క‌సారిగా అధికార‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగుతోంది. ఈ ప‌రిణామం వైర‌స్ వ్యాప్తికి కీల‌క మ‌లుపుగా మారే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అంతేగాకుండా.. త‌మ‌ను సొంతూళ్ల‌కు త‌ర‌లించాల‌ని అనేక రాష్ట్రాల్లో వ‌ల‌స కార్మికులు గుంపులుగుంపులుగా చేరి ఆందోళ‌న నిర్వ‌హించారు. ముంబైలోని బాంద్రాలో వేల‌మంది ఒక్క‌సారిగా గుమిగూడ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది.  తాజాగా.. ఈరోజు చెన్నైలో కూడా వేలాదిమంది వ‌ల‌స  కార్మికులు ఒక్క‌చోట‌కు చేరి త‌మ‌ను సొంతూళ్ల‌కు త‌ర‌లించాల‌ని ఆందోళ‌న చేశారు. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా క‌రోనా వైర‌స్ వ్యాప్తికి దోహ‌ద‌ప‌డుతాయ‌ని విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ముందుముందు భార‌త్ కొత్త స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంద‌ని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: