అప్ప‌టివ‌ర‌కూ అంద‌రూ క‌రోనా, లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుకున్నారు..  వైర‌స్ మ‌హ‌మ్మారి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డుతామో.. ఇంకా ఎన్నిరోజులు ఇలా గ‌డపాల్సి వ‌స్తుందేమోన‌ని ఆందోళ‌న చెందుతూనే నిద్ర‌లోకి జారుకున్నారు.. అర్ధ‌రాత్రి దాటింది.. అంద‌రూ గాఢ‌నిద్ర‌లో ఉన్నారు. తెల్ల‌వారు జామున ఒక్క‌సారిగా ఊపిరితీసుకోవ‌డం క‌ష్టం కావ‌డంతో నిద్ర‌నుంచి మేల్కొన్నారు. ఏం జ‌ర‌గుతుందో తెలియ‌దు.. ఊపిరాడ‌డం లేదు.. చూస్తూ ఉండ‌గానే ఒంటినిండా ద‌ద్దుర్లు, నోటి నుంచి నుర‌గ‌లు.. ముక్కు నుంచి క‌ర్తం కార‌డంతో అరుపులు.. కేక‌లు పెడుతూ ఎవ‌రికివారు ప‌రుగులు పెట్టారు. ప‌రుగులు తీస్తూనే ఎక్క‌డిక‌క్క‌డ ప‌డిపోయారు. చీక‌ట్లోనే ప‌రుగులు పెట్ట‌డ‌డంతో ప‌లువురు కాలువలు, బావుల్లో ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనాను మించిన ఈ దారుణ‌మైన ఘ‌ట‌న విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ గ్యాస్ లీకేజీతో జ‌రిగింది. ఇటీవల కాలం వరకు లాక్ డౌన్ లో ఉన్న కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

కాగా పరిశ్రమ నుంచి స్టేరైన్ అనే విష వాయువు లీక్ కావ‌డంతో భ‌యాన‌క ప‌రిస్థిత నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురు మృతి చెందగా , వంద‌ల సంఖ్య‌లో తీవ్ర అస్వస్థతకు గురైన‌ట్లు తెలుస్తోంది. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు 3 కిలోమీటర్ల​ మేర వ్యాపించింది. మ‌రో రెండు రోజుల పాటు దీని ప్ర‌భావం ఉండే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి  మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. అపస్మారకస్థితిలో రహదారిపై పడిపోయారు. ఈ క్ర‌మంలో ప‌రుగులు తీసే క్ర‌మంలో వెంక‌టాపురం గ్రామంలో గంగ‌రాజు అనే వ్య‌క్తి నేల‌బావిలో ప‌డిపోయి చ‌నిపోవ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా.. మ‌రికొంద‌రు బ‌య‌ట‌కు ప‌రుగులు తీస్తూ ప‌లు బావుల్లో ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది. అలాగే.. ఆ ప్రాంతంలో ప‌లు ప‌శ‌వులు కూడా మృత్యువాత‌ప‌డ్డాయి. వెంక‌టాపురం గ్రామంలోని ప‌చ్చ‌ని చెట్ల ఆకులు కూడా న‌ల్ల‌గా మాడిపోయాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: