దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రవాణా వ్యవస్థ కుంటుపడిపోయింది.  దాంతో ఇప్పుడు ప్రభుత్వాలకు  ఆర్థిక నష్టం భారీగానే వాటిల్లుతుంది.  ముఖ్యంగా రవాణా, మద్యం, రిజిస్ట్రేషన్లపై వచ్చే ఆదాయం పూర్తిగా స్తంభించి పోయింది. దాంతో ఇప్పుడు మద్యం దుకాణాలు తెరుచుకునే సౌలభ్యం కల్పించారు. ఇక ఆర్టీసీపై దృష్టి పెడుతున్నారు.  పరిస్థితులు కొలిక్కి వచ్చి రవాణాను తిరిగి ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.  లాక్‌డౌన్‌ కారణంగా మెట్రో రైలు రూ.100 కోట్లు, ఆర్టీసీ రూ.120 కోట్ల మేర నష్టపోయాయి. ఇక మెట్రో రైలులో మూడు బోగీల్లో కలిపి 900 మంది ప్రయాణించే వీలుండగా, ఇకపై అతి కొద్ది మందితోనే అంటే దాదాపు సగం మందితోనే రైళ్లను నడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

అలాగే, ప్రయాణికులు నిల్చునేందుకు తెలుపు రంగుతో సర్కిళ్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే, ఇకపై స్టాండింగ్ జర్నీ (నిలబడి ప్రయాణించడం)కి చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కోసం ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరిని, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు. అంతే కాదు బస్సుకు ఇరువైపులా డోర్లు ఏర్పాటు చేయాలని, శానిటైజ్ చేసిన తర్వాత బస్సులను రోడ్లపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం.  మరి అన్ని చర్యలు తీసుకొని బస్సులు ఎప్పుడు రోడ్లపైకి వస్తాయో అని ఎదురు చూస్తున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: