క‌రోనా వైర‌స్ వ్యాప్తిపై వివరాల కోసం భార‌త్‌లో తొలిసారిగా నిర్వహించిన ‘సెరో సర్వే’ ద్వారా ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు వెల్ల‌డ‌య్యాయి. దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదని తేలింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వైరస్‌ కట్టడి లో లాక్‌డౌన్‌, కంటైన్మెంట్‌ చర్యలు విజయవంతమయ్యాయని పేర్కొంది. అయితే, రానున్న రోజుల్లో భారీగా ప్రజలు వైరస్‌ ప్రభావానికి గురయ్యే ప్రమాదమున్నదని హెచ్చరించింది. శరీరంలో ఉన్న యాంటీబాడీల మోతాదును తెలుసుకోవడానికి రక్తంలోని సీరంను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. దీనినే ‘సెరో సర్వే’ అంటారు. దీని ద్వారా గతంలో వైరస్‌ సోకి ఆ తర్వాత కోలుకున్న వారితోపాటు వైరస్‌ లక్షణాలు లేనివారిని కూడా సులభంగా గుర్తించవచ్చు.

 

ఈ సంద‌ర్భంగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ మాట్లాడుతూ.. దేశంలోని 83 జిల్లాల్లోని 26,400 మందిపై సెరో సర్వేను రెండు దశల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సర్వే తొలి దశ పూర్తయిందని, రెండో దశ కొనసాగుతున్నదన్నారు. సర్వే పూర్తయిన 65 జిల్లాల్లోని ప్రజల్లో 0.73% మందికి గతంలో సార్స్‌-కోవ్‌-2 లక్షణాలు ఉన్నట్టు తెలిందన్నారు. కంటైన్మెంట్‌ జోన్లల్లో వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నదన్నారు. వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న అర్భన్‌ హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్‌ జోన్లలో దాదాపు 30% మంది ప్రజలు తమకు తెలియకుండానే వైరస్‌ ప్రభావానికి గురై, ఆ తర్వాత కోలుకున్నారన్నారు. మున్ముందు కరోనా వ్యాప్తి పెరిగి ఎక్కువ మొత్తంలో ప్రజలు వైరస్‌ ప్రభావానికి గురయ్యే ప్రమాదమున్నదని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: