ఈ రోజుల్లో చిన్న జ్వరానికే వేలకు వేలు ఫీజులు వసూల్ చేస్తున్న రోజులు. ఇక కార్పొరేట్ హాస్పిటల్స్ గురించి చెప్పనక్కరలేదు ఒక మధ్యతరగతి కుటుంబం కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాలంటే ఇల్లో లేదా పొలమో అమ్మాలి. అలాంటిది కేవలం రూ 50 కే అన్నీ రకాల వైద్య పరీక్షలు ఏంటి అని ఆశ్ఛర్యపోతున్నారా. అవును మీరు విన్నది నిజమే. విజయవాడ రైల్వే డివిజన్ ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. కేవలం రూ 50 కే వైద్య పరీక్షలను నిర్వహిస్తోంది.
 
విజయవాడ రైల్వేస్టేషన్‌లో రైల్వే శాఖ హెల్త్‌ కియోస్క్‌ను ఏర్పాటు చేసింది ఈ హెల్త్ కియోస్క్ కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రైల్వే శాఖ ఎలాంటి లాభాపేక్ష లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రధాన ముఖద్వారం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ హెల్త్‌ కియోస్క్‌లో కేవలం రూ.50 ధరకే ప్రయాణికులకు అన్ని రకాల వైద్య సేవలు చేస్తున్నారు. పరీక్షల ఫలితాలను కూడా పది నిముషాల వ్యవధిలోనే అందజేస్తున్నారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండడంతో త్వరలోనే విజయవాడ డివిజన్‌లోని ఇతర ముఖ్య రైల్వేస్టేషన్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


హెల్త్ కియోస్క్ ద్వారా శరీర బరువు, రక్తపోటు, మధుమేహం, ఎత్తు, శరీరంలో ప్రొటీన్స్‌, మినరల్స్‌, కొవ్వు శాతం, ఎముకల దృఢత్వం తదితర పరీక్షలు చేస్తున్నారు. ఈ యంత్రం ద్వారా బీఎంఐతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు రూ.50 చెల్లించి పొందవచ్చు. రైలు ప్రయాణికులే కాకుండా నగరానికి చెందిన అనేక మంది స్టేషన్‌కు విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ యంత్రం ద్వారా వచ్చే వైద్య పరీక్షల ఫలితాల్లో ఏమైనా తేడాలు ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ద్వారా ముందుగానే మేల్కోవచ్చు. ఈ హెల్త్ కియోస్క్ నిర్వహణను రైల్వే శాఖ ఒక సంస్థ కు ఏడాది కాలం పాటు కాంట్రాక్టు కు ఇచ్చినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: