నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI హైవేలపై వెళ్లే వాహనాలన్నింటికీ ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గత కొంత కాలంగా ఫాస్ట్‌ట్యాగ్‌పై ప్రచారం చేస్తోంది.  డిసెంబర్ 1 లోగా వాహనదారులు తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాలని ఆదేశించింది. ఫోర్‌ వీలర్ ఉన్న ప్రతీ ఒక్కరూ టోల్ ప్లాజా ఆపరేటర్ల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనాలకు ప్రత్యేకమైన లేన్ ఉంటుంది. 

 

అంటే... ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న వాహనాలు టోల్ ఆ లేన్‌లో నేరుగా వెళ్లిపోవచ్చు. టోల్ ఫీజు అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలు ఇతర వరుసలో టోల్ ఫీజు చెల్లించి వెళ్తుంటాయి. డిసెంబర్ 1 నుంచి ఈ లేన్లు ఉండవు. అన్ని లేన్లను ఫాస్ట్‌ట్యాగ్ లేన్లుగా మార్చుతోంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా.

 

టోల్‌ గేట్ల దగ్గర టోల్ ఫీజు వసూలు చేసే పద్ధతిని సులభతరం చేయడంతో పాటు రద్దీ పెరగకుండా చేయాలన్న ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI. మొదటిసారిగా అహ్మదాబాద్-ముంబై రహదారిపై ఫాస్ట్‌ట్యాగ్ లేన్ ప్రారంభించారు. అక్కడ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో ఇతర జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేన్లను ప్రారంభించింది NHAI. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 500 పైగా టోల్ ప్లాజాలు ఉన్నాయని అంచనా. ఫాస్ట్‌ట్యాగ్స్ వ్యవస్థ అన్ని టోల్ ప్లాజాల దగ్గర లేదు. డిసెంబర్ 1 నుంచి టోల్‌ప్లాజాల్లోని అన్ని లేన్లు ఫాస్ట్‌ట్యాగ్ లేన్లుగా మారిపోనున్నాయి.

 

వాహనదారుల సేవింగ్స్ అకౌంట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది. టోల్ ఛార్జీ చెల్లించేందుకు వాహనదారులు వాహనాన్ని టోల్ ప్లాజా దగ్గర ఆపాల్సిన అవసరం లేదు. దీని వల్ల టోల్ గేట్ల దగ్గర రద్దీ తగ్గిపోతుంది. ఫాస్ట్‌ ట్యాగ్‌ను టోల్ గేట్ల దగ్గర, బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు. పేటీఎం, అమెజాన్ లాంటి యాప్స్, పెట్రోల్ బంకుల్లో కూడా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవచ్చు. మరి మీ వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే డిసెంబర్ 1 లోగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: