సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ మంగళవారం అధికారికంగా తన బ్లాక్ చెయిన్ ఆధారిత క్రిప్టోకరెన్సీ, లిబ్రాను ఆవిష్కరించింది. 2020లో విడుదల కానున్న ఫేస్ బుక్ క్రిప్టోకరెన్సీని ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్, డేటా కనెక్టివిటీతో చూసుకోవచ్చు. కొత్త క్రిప్టోకరెన్సీ కోసం ఫేస్ బుక్ 'క్యాలిబ్రా' అనే డిజిటల్ వ్యాలెట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ వ్యాలెట్ మెసెంజర్, వాట్సాప్ లతో పాటు ప్రత్యేకమైన యాప్ గా కూడా లభించనుంది. యూజర్లు లిబ్రా క్రిప్టోకరెన్సీని ఆన్ లైన్, ఆఫ్ లైన్ సేవలకు వినియోగించవచ్చని ఫేస్ బుక్ తెలిపింది. 

కొత్త క్రిప్టోకరెన్సీకి ఊపు తెచ్చేందుకు ఫేస్ బుక్, 27 మంది భాగస్వాములతో కలిసి ఒక లాభాపేక్ష రహిత లిబ్రా అసోసియేషన్ ను ఏర్పాటు చేసింది. కొత్త సేవలను క్రిప్టోకరెన్సీ ఎక్స్ ఛేంజ్ కాయిన్ బేస్, మాస్టర్ కార్డ్, పేపాల్, వీసా వంటి పేమెంట్ సంస్థలు అందజేస్తాయి. ఊబర్, వోడాఫోన్, ఈబే, స్పాటిఫై, లిఫ్ట్ వంటి సంస్థలు కూడా ఫేస్ బుక్ లిబ్రా అసోసియేషన్ లో భాగం కానున్నాయి. లిబ్రా క్రిప్టోకరెన్సీ అధికారిక విడుదలకు ముందు 100 మంది సభ్యులను పొందాలని ఫేస్ బుక్ లక్ష్యంగా పెట్టుకుంది. 

లిబ్రా క్రిప్టోకరెన్సీ ఎలా పనిచేస్తుంది?

లిబ్రా బ్లాక్ చెయిన్' ఆధారంగా లిబ్రా పని చేస్తుంది. ఇందులో కరెన్సీ యూనిట్ ని 'లిబ్రా' అని పిలుస్తారు. ఈ క్రిప్టోకరెన్సీ 'ఆస్తుల నిల్వకు అంతర్గత విలువ ఇచ్చే విధంగా' పని చేస్తుంది. ఈ కరెన్సీ లిబ్రా అసోసియేషన్ నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనేక ఇతర క్రిప్టోకరెన్సీల మాదిరిగా కాకుండా లిబ్రా నిజమైన ఆస్తుల నిల్వ ఆధారంగా ఉంటుందని ఫేస్ బుక్ తెలిపింది. ఈ లిబ్రా విలువ ఇతర కరెన్సీలు, క్రిప్టోకరెన్సీల మాదిరిగా తీవ్రమైన ఒడిదుడుకులకు లోను కాకుండా అన్నివేళలా ఇంచుమించు అంతే విలువతో ఉండనుంది.

క్యాలిబ్రా వ్యాలెట్, ప్రైవసీ ...

తమ కొత్త డిజిటల్ వ్యాలెట్ క్యాలిబ్రా యూజర్ల డబ్బు, సమాచారం భద్రంగా ఉండే విధంగా బలమైన రక్షణతో వస్తున్నట్టు ఫేస్ బుక్ హామీ ఇచ్చింది. బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఉపయోగించే యూజర్ వెరిఫికేషన్, ఇతర చర్యలను ఈ వ్యాలెట్ వినియోగించనుంది. యూజర్లు పాస్ వర్డ్ లు తిరిగి పొందేందుకు, ఫోన్ పోగొట్టుకున్న సందర్భాలలో సహాయపడేందుకు ప్రత్యేకమైన సపోర్ట్ ఉండనుంది. యూజర్ల ఖాతాల్లోకి ఎవరైనా తప్పుదోవలో ప్రవేశిస్తే వారికి కలిగిన నష్టం మొత్తాన్ని తిరిగి ఇస్తామని ఫేస్ బుక్ వాగ్దానం చేస్తోంది. యూజర్ల అనుమతి లేకుండా ఖాతా సమాచారం, ఆర్థిక వివరాలను థర్డ్ పార్టీ సహా ఎవరికీ ఇవ్వబోమని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. అంటే క్యాలిబ్రా వ్యాలెట్ డేటాను ఉపయోగించుకొని ఫేస్ బుక్ నుంచి వ్యాపార ప్రకటనలు పంపించరు.


మరింత సమాచారం తెలుసుకోండి: