రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు ఎలా ఉప‌యోగ‌ప‌డితే.. అలా వాడేసుకోవ‌డం నాయ‌కుల ల‌క్ష‌ణం. త‌మ ప‌ని జ‌రిగిపోతే చాలు.. అన్న విధంగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ నేత‌, మంత్రి, సీఎం కుమార‌డు కేటీఆర్ కూడా ఇలాంటి రాజ‌కీయాల‌కే తెర‌దీశారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌ల న‌గారా మోగింది. దాదాపు 2018 డిసెంబ‌రులో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత జ‌ర‌గుతున్న ఈ ఎన్నిక‌ల‌కు ఎంతోప్రాధాన్యం ఉంది. కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త పెరిగింద‌ని, ఆయ‌నలో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లోపించాయ‌ని.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

 

అంతేకాదు, ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం, అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కాన్ని అమ‌లు చేయ డం, గ్రామ సచివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం, మ‌ద్య నియంత్ర‌ణ, అన్ని ప‌ద‌వుల్లోనూ మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డం, మంత్రి వ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం, ఏకంగా హోం శాఖ‌ను ఎస్సీ మ‌హిళ‌కు కేటాయించ‌డం  వంటి కీల‌క కార్య‌క్ర‌మాల ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మిత్రుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ దూసుకుపోతున్నార‌ని, ఆయ‌న‌ను చూసి కేసీఆర్ చాలా నేర్చుకోవాల‌ని తెలంగాణ‌లోని విప‌క్షా లు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో ఇది ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే వెళ్లింది.

 

ఇది ప్ర‌స్తుత‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌పై యాంటీ రిజ‌ల్ట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన కేసీఆర్‌.. వ్యూహాత్మ‌కంగా త‌న కుమారుడు కేటీఆర్‌ను రంగంలోకి దింపారు. త‌న‌ను జ‌గ‌న్‌తో పోలుస్తూ.. విప‌క్షాలు చేస్తున్న రాద్ధాంతానికి త‌న‌దైన శైలిలో చెక్ పెట్టాల‌న్న తండ్రి వ్యూహానికి కేటీఆర్ మెరుగులు దిద్దారు. తాజాగా నిన్న ఆయ‌న మీడియా స‌మావేశం పెట్టేసి.. జ‌గ‌న్‌ను త‌న తండ్రిని పోల్చారు. ‘‘రాజధాని మారుస్తామంటే పక్క రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ, తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేశాం. 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచాం. అయినా, ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. ఇబ్బందులు తలెత్తలేదు. అంతా సాఫీగా జరిగిపోయింది. ఇది సీఎం కేసీఆర్‌ సమర్థ నాయకత్వం, పరిపాలనా దక్షతతోనే సాధ్యమైంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 

అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ స‌హా బీజేపీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఈ విధంగా చెక్ పెట్టాల‌ని అనుకున్నారు. జ‌గ‌న్ పెద్ద పాల‌నా ద‌క్ష‌త ఉన్న నాయ‌కుడు కాద‌నే విధంగా ప్ర‌తిప‌క్షాల‌కు ఆయ‌న చెక్ పెట్టాల‌ని అనుకున్నారు. కానీ, ఇది పెద్ద‌గా ప్ర‌జ‌ల‌లోకి వెళ్ల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలో డీకే అరుణ స‌హా అనేక మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప‌లు జిల్లాల ఏర్పాటును విభ‌జ‌న‌ను తీవ్ర స్థాయిలో ప్ర‌తిఘ‌టించిన విష‌యం కేటీఆర్ మ‌రిచిపోయినా.. ప్ర‌జలు ఇంకా మ‌రిచిపోలేదు. పైగా న్యాయ‌స్థానాలు జోక్యం కూడా చేసుకున్నాయి. అదే స‌మ‌యంలో ఆయా ప్రాంతాల్లో అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ కూడా అప్ప‌ట్లో విధించార‌ని ఇదే మీడియా క‌థ‌నాలు రాసిన విష‌యాన్ని కేటీఆర్ మ‌రిచిపోయినా.. మేధావులు మ‌రిచిపోలేదు.. సో.. జ‌గ‌న్‌ను వాడుకోవాల‌ని చూసినా.. కేటీఆర్ త‌ప్పులో కాలేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: