దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి .. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీకి మధ్య ఉన్న బంధం ఏంటి.. వైసీపీ మోడీకి మిత్రపక్షమూ కాదు.. అలాగని వైరి పక్షమూ కాదు.. ఎన్డీఏలో చేరకపోయినా మోడీ సర్కారును బలపరచడంలో వైసీపీ ఏనాడు వెనుకడగు వేయలేదు. అలాగని ఎన్డీఏలోనూ చేరలేదు. కానీ.. కేంద్రంలో మద్దతు దృష్ట్యా బీజేపీ అగ్రనేతలు వైసీపీని మిత్రపక్షంగానే భావిస్తున్నారు.

 

 

రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయం సంగతి పక్కకుపెడితే జగన్ మాత్రం కేంద్రం దగ్గర తనకు అవసరమైన రాజకీయ నిర్ణయాలకు మాత్రం ఆమోద ముద్ర వేయించుకుంటూనే ఉన్నాడు. ఇందుకు తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉద్వాసనే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిమ్మగడ్డ వర్సస్ జగన్ మధ్య పంచాయతీ ఎన్నికల వేళ ఎంత రచ్చ జరిగిందో దేశమంతా చూసింది. కరోనా ఇష్యూ ఇంత పెద్దది కాకపోయి ఉంటే.. ఇదే ఇష్యూ పొలిటికల్ సర్కిళ్లో హాట్ టాపిక్ అయ్యేది.

 

 

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి జగన్ గెంటేసిన తీరు చూస్తే.. అందుకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర ఉందనే చెప్పాలి. ఇలాంటి వివాదాస్పద ఆర్డినెన్సును ఏమాత్రం తటపాయించకుండా గవర్నర్ సంతకం పెట్టేశాడంటే.. అందుకు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమై ఉండాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక నిబంధనలు రాష్ట్రానికి సంబంధించిన విషయమే అయినా వివాదాస్పదం అయినప్పుడు.. గవర్నర్ అంత సులభంగా సంతకం పెట్టే అవకాశాలు ఉండవు.

 

 

అందులోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ద సంస్థ విషయంలో గవర్నర్ అంత సాహసం చేసే అవకాశం లేదు. కచ్చితంగా ఢిల్లీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాల ఆధారంగానే రమేశ్ కుమార్ గెంటివేత జరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ ఎంత క్లోజో అని ఏపీ రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: