రాష్ట్రంలో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించి ఏడాది పూర్త‌యింది. పాల‌న అందిపుచ్చుకోవ‌డ‌మే కాకుండా.. రాష్ట్రంలోని పార్ల‌మెంటు స్థానాల్లో 22 కైవ‌సం చేసుకుని దూసుకుని పోయింది. ఈ ప‌రిణామానికి ఏడాది పూర్త‌యింది. వాస్త‌వానికి ఎంపీలుగా గెలిచిన వైసీపీ నేత‌ల్లో ఎక్కువ మంది తొలిసారి పార్ల‌మెంటులో అడుగు పెట్టిన‌వారే. కొత్త‌గా రాజ‌కీయ జెండాలు ప‌ట్టుకున్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో యువ‌కులు ఎక్కువ‌గా ఉండ‌డం, ఉన్న‌త‌స్థాయి విద్య చ‌దువుకున్న వారు అధికంగా ఉండడం గ‌మ‌నార్హం. ఇక‌, వీరు పార్ల‌మెంటుకు వెళ్లి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో వైసీపీ ఎంపీల గ్రాఫ్ ఎలా ఉంద‌నేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. మ‌రీ ముఖ్యంగా ఏపీకి పార్ల‌మెంటు నుంచి అనేక రూపాల్లో న్యాయం జ‌ర‌గాల్సి ఉంది. దీంతో ఈ ఎంపీల వ్య‌వ‌హార శైలిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

 

రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర‌గాల్సిన విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. మొత్తం వైసీపీ ఎంపీల్లో దూకుడుగా ఉన్న‌ది ఎవ‌రు..?  నియోజ‌క‌వ‌ర్గా లకు ప్రాధాన్యం ఇస్తున్న‌ది ఎవ‌రు?  నియోజ‌క‌వ‌ర్గంపై సాధికార‌త సాధిస్తోంది ఎవ‌రు? ప‌్ర‌జ‌ల‌కు ఎవ‌రు అందుబాటులో ఉంటు న్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. మొత్తం 22 మంది లో మ‌హిళా ఎంపీల‌ను ప‌క్క‌న పెడితే.. ఇద్ద‌రే ఇద్ద‌రు యువ ఎంపీలు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ విజ‌న్‌కు, సీఎం జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తున్నారు. వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ముందుకు సాగుతున్నారు. అదేస‌మ‌యంలో అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఎక్క‌డా వివాదానికి తావులేకుండా, విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో వీరి గురించి వైసీపీలోను, నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ చ‌ర్చ సాగుతోంది.

 

కృష్ణ‌దేవ‌రాయ‌లు..
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన యువ ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయులు. వైసీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కిన విద్యావంతుడు. సౌమ్యుడిగా, వివాద ర‌హితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా ఆయ‌న పంథాలోను, వ్య‌వ‌హార శైలిలోను ఎక్క‌డా మార్పులేద‌నే టాక్ జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. స్థానిక వైసీపీ నేత‌ల‌తో క‌లిసిమెలిసి ఉండ‌డం ద‌గ్గ‌ర నుంచి ప్ర‌జ‌ల‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలోను ఆయ‌న దూకుడుగా ఉన్నారు. అదేస‌మ‌యంలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌ను పూర్తిస్థాయిలో అమ‌లు చేస్తున్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లాల వారీగా అభివృద్దికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుని, ఎంపీ నిధులు కేటాయిస్తున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్ విజ‌న్ మేర‌కు ప్ర‌బుత్వ కార్య‌క్ర‌మాలను ప్ర‌జ‌లకు చేరువ‌య్యేలా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎంపీగా మంచి మార్కులు సాధిస్తున్నారు.

 

కోట‌గిరి శ్రీధ‌ర్‌..
ఏలూరు ఎంపీగా విజ‌యం సాధించిన మ‌రో యువ నాయ‌కుడు కోట‌గిరి శ్రీధ‌ర్‌. వైసీపీ ఎంపీల్లో ది బెస్ట్ అనిపించుకుంటున్న నా య‌కుడు కూడా ఈయ‌నే. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. కోట‌గిరి విద్యాధ‌ర‌రావు వారసుడిగా రంగంలోకి వ‌చ్చిన శ్రీధ‌ర్‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ‌యం సాధించారు. 165925 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక‌, జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు కూడా అయిన శ్రీధ‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా దేశ‌వ్యాప్త ఎంపీల్లో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ప‌ర్య‌వ‌ర‌ణానికి త‌న నియోజ‌క ‌వ‌ర్గంలో పెద్ద‌పీట వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వివాదాల‌కు అతీతంగా పార్టీలోని ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతూ.. ముందుకు సాగుతున్నారు. త‌న‌కు తెలిసిన ఎన్నారైల ద్వారా పెట్టుబ‌డుల‌కు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు ఎంపీలు కూడా వైసీపీలో ఐకాన్‌లుగా నిలుస్తున్నార‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: