పైకి నవ్వుతూ..తనకి అడ్డం వచ్చిన వాళ్ళని నట్టేట ముంచడమే నేటి రాజకీయం. ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. తాను ఎదగక పోయినా పర్లేదు గానీ పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనుకునే నాయకులు ఎందరో. ఒకడు ఎదుగుతున్నాడు అంటే వాడిని కిందకి దించడమే లక్ష్యంగా పెట్టుకునే నాయకులు కూడా చాలా మందే ఉన్నారు. పైకి కలిసి మెలిసి ఉంటున్నట్టు నవ్వుతూ నటిస్తారు.. కానీ, లోపల ఎవరి వ్యూహాలు వారు పన్నుతారు. అచ్చం ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఎదురైనట్టు తెలుస్తుంది. అసలు కథ ఏంటంటే....

 

ఈనెల 18వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కాబోతున్నారు. కాబట్టి వారు తమ మంత్రి పదవులకు తప్పకుండా రాజీనామా చేస్తారు. దీంతో రెండు కేబినెట్ సీట్లు ఖాళీ అవుతాయి. అలాగే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొంత మంది మంత్రుల పనితీరుపై సీఎం జగన్ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు. వారిని తప్పించి కేబినెట్ ప్రక్షాళన చేసి మరికొంత మంది కొత్తవారిని కేబినెట్ లోకి తీసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో మంత్రి పదవి కోసం కొందరు సీనియర్ నేతలతో పాటుగా మరికొందరు యువనేతలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా బలంగా ఉన్న తమను మంత్రి వర్గంలోకి తీసుకోవాలి అని వారు సీఎం జగన్ ని కోరుతున్నారు. ఇలా ప్రయత్నిస్తున్న వారిలో నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఉన్నారట. వాస్తవానికి రోజాకు మొదటి మంత్రివర్గ విస్తరణ లోనే కీలకమైన మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆమె పేరును జగన్ తప్పించి ఆమె అసంతృప్తికి గురి అవకుండా ఆ తర్వాత ఏపీ ఏఐసీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఉండటానికి ఆమె అక్కడ చైర్మన్ గా ఉన్నా, మనసంతా కేబినేట్ హోదా మీదే ఉందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూడా ఆమెకు కేబినేట్ లో మాత్రం అవకాశం రాకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే...

 

రోజాను మంత్రి వర్గంలోకి తీసుకుంటే తమ హవాకు గండి పడుతుంది అనే ఆలోచనతో ఉన్న రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు మంత్రులు రోజాకి మంత్రి పదవి దక్కకుండా తెరవెనుక మంత్రాంగం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై గత కొన్నిరోజులగా వైసీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. రోజా వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే... ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, పార్టీకి బలమైన వాయిస్ వినిపించారు. అందుకే ఆమెను ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు. పైగా సీఎం జగన్ కూడా ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలోనే కొత్తగా ఏర్పాటు చేయబోయే మంత్రివర్గ విస్తరణలో రోజా పేరును జగన్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే రోజా మాత్రం జగన్ తనకు తప్పకుండా న్యాయం చేస్తారని, తాను మంత్రి అవుతానని తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట. మరి జగన్ ఎవరి మాటలకి విలువనిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: