జగన్ ఏపీ సీఎంగా పగ్గాలు అందుకున్న ఏడాది తర్వాత ఇప్పుడు రాజకీయం మరింత వేడక్కింది. అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా నాలుగు రోజుల ముందు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడం రాజకీయంగా కలకలం రేపింది. ఆ తర్వాత రోజే జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో వేడి బాగా పెరిగింది. అయితే ఈ దూకుడుపై టీడీపీ నిప్పులు చెరుగుతోంది. అంతా కక్ష సాధింపు అంటోంది.

 

 

టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే.. మరో కీలకపార్టీ బీజేపీ మాత్రం అనూహ్యంగా జగన్ కు మద్దతు తెలిపింది. అంతే కాదు.. అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి వంటి వారు చాలా చిన్న వికెట్లని.. జగన్ అసలు అరెస్టు చేయించనివాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారని అంటోంది. అంతే కాదు.. జగన్ ఎన్నికల ముందు చేసిన శపథాలను గుర్తు చేస్తూ కర్తవ్యబోధ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపుతామని ఎన్నికల ముందు జగన్ ప్రజలకు వాగ్దానం చేసిన విషయాన్ని ఏపీ బీజేపీ గుర్తు చేస్తోంది.

 

 

కానీ జగన్ వచ్చాక పెద్ద కుంభకోణాల విషయంలో ఆశించినంత స్పీడ్ లేదని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఎందుకంటే.. జగన్ అధికారంలోకి రాకముందు.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై ఓ కమిషన్ కూడా వేశారు. కానీ ఇప్పటి వరకూ దానిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. అలాగే.. అమరావతి భూముల విషయంలోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని బాగా ఆరోపించారు.

 

 

కానీ అటు పోలవరం విషయంలోనూ.. ఇటు అమరావతి విషయంలోనూ టీడీపీ సర్కారు చేసిన అవినీతిని జగన్ సర్కారు ఇప్పటి వరకూ బయటపెట్టలేకపోయింది. అందుకే ఈఎస్‌ఐ స్కామ్ వంటివి చాలా చిన్నవని.. అసలు పెద్ద కుంభకోణాల విషయంలో జగన్ దూకుడు చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. జగన్.. వింటున్నావా మరి.. నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: