తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో కేసీఆర్‌కు పెద్దగా ఇబ్బందులు ఉన్నాయా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదనే చెప్పాలి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ని మరీ ఇబ్బంది పెట్టే స్థాయి అక్కడి ప్రతిపక్షాలకు లేదు. కానీ కేసీఆర్‌ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే నాయకుడు మాత్రం ఒకరు ఉన్నారు. కేసీఆర్ పేరు చెబితేనే చాలు, ఒంటికాలి మీద లేస్తూ, కేసీఆర్ పక్కలో బల్లెంలా ఉంది.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్కరే.

 

రేవంత్ టీడీపీలో ఉన్నా దగ్గర నుంచి కేసీఆర్‌ని ఎక్కువ టార్గెట్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు, కేసీఆర్‌ గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం కూడా రేవంతే. ఆయన ఆధిపత్యం కోసమని చెప్పి, ఒక ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవడానికి ప్రయత్నించి, ఓటుకు నోటు కేసులో బుక్ అయ్యారు. ఇక ఇక్కడ నుంచి రాజకీయాలు మారిపోయాయి. రేవంత్ జైలుకు వెళ్ళడం, తెలంగాణలో టీడీపీ క్లోజ్ అయిపోవడం, ఉమ్మడి రాజధాని హైదరబాద్ నుంచి చంద్రబాబు అమరావతికి వెళ్లిపోవడం జరిగిపోయాయి.

 

ఇక తర్వాత రేవంత్ కూడా టీడీపీలో ఉంటే భవిష్యత్ కష్టమని చెప్పి, కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చినా సరే రేవంత్...కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సీనియర్ నేతల సహకారం లేకపోయినా..కేసీఆర్ మీద ఒంటికాలి మీద వెళుతూనే ఉన్నారు. కేసీఆర్‌ని ఎక్కువగా ఇబ్బందిపెడితే పీసీసీ పదవి వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మాత్రం రేవంత్‌కు పీసీసీ రాకుండా సీనియర్ నేతలు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

 

ఎవరు అడ్డుపడినా సరే రేవంత్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల కూడా కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించారని, ఇక ఆ నిర్మాణం పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందని రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం, ఎన్‌జి‌టి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం జరిగాయి. అయితే జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కేటీఆర్‌తో పాటుగా తెలంగాణ సర్కార్‌కు, హెచ్ఎండిఎ, పిసిబిలకు నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే విధించడం రేవంత్ రెడ్డికి షాక్ అనే చెప్పాలి.

 

అయితే రివర్స్‌లో ఎన్ని షాకులు తగిలిన మనోడుకు కేసీఆర్ అంటే బాగా ప్రేమ(ద్వేషం) కదా! అందుకే తాజాగా కేసీఆర్‌ని మరింత ఇబ్బంది పెట్టడంలో భాగంగా మైండ్ గేమ్ మొదలుపెట్టారు. “మంత్రి ఈటలపై వేటు పడబోతోంది. ప్రస్తుతం కేసీఆర్ అందుకోసం కత్తి నూరుతున్నారు. వచ్చే వారమే మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ తల ఎగిరిపోబోతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో భాగంగా జరుగుతున్న వైఫల్యాలు మొత్తం ఈటల ఖాతాలో వేసి, ఆయన్ను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయాలను టీఆర్ఎస్ మిత్రుడే నాకు ఫోన్ చేసి చెప్పారు” చెప్పరంటూ రేవంత్ ఓ బాంబు పేల్చారు. మరి ఈ బాంబు పేలి కేసీఆర్ కు ఏమన్నా ఇబ్బంది ఎదురవుతుందా? లేక రివర్స్‌లో పేలి రేవంత్‌కు ఇంకా డ్యామేజ్ జరుగుతుందా? అనేది చూడాలి. కానీ కేసీఆర్ అంటే రేవంత్‌కు లవ్ ఎక్కువ కాబట్టి..ఎన్ని షాకులు తగిలినా..రేవంత్ మాత్రం కేసీఆర్‌ని వదలడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: