రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మే. అధికార పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఎప్పుడూ కాచుకునే ఉంటాయి. అయితే, గ‌తంలో మాదిరిగా ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తామ‌న్నా.. లేని పోని అభూత క‌ల్ప‌న‌ల‌ను సృష్టించి ప్ర‌భుత్వ పార్టీపై విరుచుకుప‌డ‌తామ‌న్నా.. అయ్యే ప‌నికాదు. అశేష ప్ర‌జానీకం న‌మ్మేదీ కాదు! దీనికి కార‌ణం.. ప‌ర‌మాద్భుత‌మైన చ‌ర‌వాణి ప్ర‌తి ఒక్క‌రి చేతుల్లోనూ నిముషాల వ్య‌వ‌ధిలో `అస‌లు సంగ‌తేంటో` వివిధ రూపాల్లో ప్ర‌చారం చేస్తోంది. దీంతో ప్ర‌తిప‌క్షాలు కానీ, ప్ర‌త్య‌ర్థి ప‌క్షాలు కానీ, ఆచితూచి అడుగులు, లెక్క‌పెట్టుకుని విమ‌ర్శ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

 

కానీ, గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల్లో చాలా వ‌ర‌కు తేలిపోయే విమ‌ర్శ‌లే క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వంపై ఏదో ఒక విమ‌ర్శ చేయాల‌నే దుగ్ధ‌తో ప్ర‌తిప‌క్షం టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తోంద‌నే భావ‌న స‌ర్వ‌త్రా వినిపిస్తున్న‌ది. అదిగో పులి.. అని ఎవ‌రైనా అంటే.. వెంట‌నే ఇదిగోతోక‌.. అనేస్తున్నారు టీడీపీ నేత‌లు. దీనికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు కూడా అతీతం కాకుండా పోవ‌డ‌మే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పైనా విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ట‌యింది. తాజాగా ఒంగోలుకు చెందిన మంత్రి, వైఎస్సార్ సీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత బాలినేని శ్రీనివాస‌రెడ్డిపై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

 

 ప్రకాశంజిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన నగల దుకాణం నిర్వాహకులు కారులో రూ.4 కోట్లు తరలిస్తూ తమిళనాడు పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా స్థానికంగా అధికార వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే వారే కావడం గమనార్హం. పైగా... కారుపై ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ కూడా అతికించుకున్నారు. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని ఎళావూరు చెక్‌పోస్ట్‌ వద్ద  తమిళనాడు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో టయోటా ఫార్చ్యూనర్‌ కారు చెక్‌పోస్టు వద్దకు వచ్చింది.  కారులో ఉన్న వారు చెన్నై వెళ్లేందుకు అనుమతి కోరారు.

 

ఈ-పాస్‌ లేకుండా వెళ్లడం కుదరదని పోలీసులు తేల్చిచెప్పారు. ఆ తర్వాత అనుమానం వచ్చి కారును తనిఖీ చేయగా.. నాలుగు బ్యాగ్‌ల్లోంచి కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. నాగరాజ్‌ (32), వసంత్‌ (36), డ్రైవర్‌ లక్ష్మీనారాయణ (28)లను అదుపులోకి తీసుకొని చెన్నై ఐటీ అధికారులకు అప్పగించారు. అయితే, కారుపై బాలినేని స్టిక్క‌ర్ ఉండ‌డంతో త‌మిళ టీవీ చానెళ్లు కొన్ని ఆయ‌న‌ను ఈ కేసులోకి లాగే ప్ర‌య‌త్నం చేశాయి. దీంతో వెంట‌నే స్పందించిన బాలినేని త‌న‌కు దీనికి సంబంధం లేద‌న్నారు. ఎలాంటి విచార‌ణ అయినా జ‌రిపించాల‌ని కోరారు. అయితే, ఈ విష‌యాన్ని మాత్రం టీడీపీ త‌న‌కు అనుకూలంగా వాడుకోవ‌డం, ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోయ‌డం చేస్తోంది. అయితే, సోష‌ల్ మీడియా జ‌నాలు మాత్రం ఇది త‌గునా?  సార్‌? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి టీడీపీకి ఇంత దుర‌ద ఎందుకో?! వారే తేల్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: