ఒక మహిళ తనతో ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొంటే, ఆమెపై అత్యాచారం చేశానంటూ అన్యాయంగా శిక్ష వేశారంటూ బ్రిటన్‌ కోర్టు తీర్పును ఓ వ్యక్తి సవాలు చేస్తున్నారు.మరి, ఒక పురుషుడు తన భాగస్వామి అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నా కూడా, ఏయే సందర్భాలలో అతడు అత్యాచార నేరస్థుడు అయ్యే అవకాశం ఉంటుంది? ఈ కేసులో ఎలాంటి చిక్కుముడులు ఉంటాయి?
యూకేకు చెందిన శాలీకి (పేరు మార్చాం) ఓ డేటింగ్ వెబ్‌సైట్‌ ద్వారా జాసన్ లారెన్స్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్తా శారీరక సంబంధంగా మారింది.అప్పటికే తల్లి అయిన 42 ఏళ్ల శాలీ, మరో సంతానం వద్దనుకున్నారు. అయితే, తాను వాసెక్టమీ (పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ) చేయించుకున్నానని, తనతో సెక్సులో పాల్గొంటే గర్భం రాదని లారెన్స్‌ ఆమెకు చెప్పాడు.
అతని మాటలు నమ్మి కండోమ్ లేకుండానే అతనితో సెక్సులో పాల్గొనేందుకు శాలీ అంగీకరించారు. కానీ, ఆమె గర్భం దాల్చారు. అతడు అబద్ధం చెప్పాడని ఆమెకు అప్పుడు అర్థమైంది. అతడు సీరియల్ రేపిస్టు అన్న విషయం కూడా తెలిసింది.శాలీ మీద అత్యాచారం కేసులో తనను దోషిగా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పును లారెన్స్ సవాల్ చేస్తున్నారు.వాళ్లు రెండుసార్లు సెక్సులో పాల్గొన్నారు. కాబట్టి, ఆ మహిళపై రెండు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ లారెన్స్‌ను దోషిగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
"వాసెక్టమీ గురించి అబద్ధం చెప్పడం ద్వారా బాధితురాలిని అతడు మోసం చేశాడు" అని ఈ కేసులో లారెన్స్‌కు వ్యతిరేకంగా వాదించిన సీనియర్ స్యూ మాథ్యూస్ అన్నారు.
"ఈ శిక్షను సమర్థిస్తే, చట్టం దృష్టిలో ఇన్నాళ్లూ నేరస్థులుగా పరిగణించబడని అనేక మంది (మగ, ఆడ) తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడ్డారన్న కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది" అని లారెన్స్ తరఫు న్యాయవాది షాన్ డ్రేకాట్ అంటున్నారు.లారెన్స్ మాదిరిగా భాగస్వాములకు అబద్ధాలు చెప్పినవారు చాలామందే ఉంటారు. మరి, వాళ్లు కూడా ఇప్పుడు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందా?


మరింత సమాచారం తెలుసుకోండి: