మనుషులు తీసుకొనే ప్రతి అహార పదార్థంలోను ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతోంది. కల్తీ అహార పదార్థాలను గుర్తించలేక అనునిత్యం ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలను తీసుకోవటం వలన అమాయకులైన ప్రజలు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహార పదార్థాలలో కల్తీని కొన్ని భౌతిక మరియు రసాయన పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. 
 
పాలను కల్తీ చేయడానికి సాధారణంగా గంజిపొడి, యూరియా కలుపుతారు. పరీక్ష నాళికలో 4 మి.లీ పాలను తీసుకొని అయోడిన్ కలపాలి. పాలు నీలి రంగులోకి మారితే గంజిపొడి కలిపారని గుర్తించాలి. 4 మి.లీ పాలలో రెండు చుక్కల బ్రోమోథైమోల్ కలిపినపుడు పాలు నీలిరంగులోకి మారితే యూరియా ఉన్నట్లు గుర్తించాలి. పసుపులో కల్తీ గుర్తించాలంటే కొంచెం పసుపును తీసుకొని నీటిలో ఉంచాలి. పసుపులో రంపపు పొట్టు కలిపితే పొట్టు నోటిపై తేలుతుంది. కారంలోని కల్తీని కూడా ఇదే విధంగా గుర్తించవచ్చు. 
 
టీపొడిని ఇనుప రజను కలిపి కల్తీ చేస్తారు. అయస్కాంతంను ఒక పేపర్ పై టీపొడి తీసుకొని అటూ ఇటూ తిప్పితే అందులో ఇనుప రజనును గుర్తించవచ్చు. పంచదారలో కల్తీ గుర్తించాలంటే పంచదారను నీటిలో కలపాలి. పంచదారను చాక్ పౌడర్ తో కల్తీ చేసి ఉంటే చాక్ పౌడర్ నీటి అడుగుకు చేరుతుంది. మిరియాలను నీటిలో కలిపితే బొప్పాయి విత్తనాలతో కల్తీ చేసి ఉంటే బొప్పాయి విత్తనాలు నీటిపై తేలుతాయి. 
 
కొబ్బరినూనెలో కల్తీ జరిగిందో లేదో తెలుసుకోవాలంటే కొబ్బరినూనెను చిన్నగిన్నెలో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. కల్తీ జరిగిన కొబ్బరినూనె అయితే కొబ్బరినూనె గడ్డ కట్టదు. పచ్చి బఠానీలను 20నిమిషాల పాటు నీటిలో ఉంచితే కల్తీ జరిగిన పచ్చి బఠానీల రంగు 20నిమిషాల తరువాత వేరుగా కనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: