కాల‌చ‌క్రం గిర్రున తిరిగింది. ఉగాది ప‌చ్చ‌డిలోని ష‌డ్రుచ్చుల వ‌లె ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో క‌ష్ట సుఖాలు..సంతోషాల‌ను.. బాధ‌ల‌ను..మిగిల్చి కాలం ఒడిలోకి 2019 సంవ‌త్స‌రం చేరిపోతోంది. ఇక సెల‌వంటూ..చరిత్ర పుట‌ల్లోకి వెళ్లిపోతోంది. కాలం అంద‌రికీ ఎప్పుడూ ఒకే అనుభూతుల‌ను ఇవ్వ‌ద్దు. ఒక‌రికి చేదు గుళిక కావ‌చ్చు..మ‌రొక‌రికి ప్ర‌సాదం కావ‌చ్చు..ఏది ఏమైనా గ‌డిచిన కాల‌మంతా మ‌న‌కు జ్ఞాప‌క‌మే. కొంద‌రికీ తీపిగుర్తులను మిగిల్చితే..మ‌రికొంత‌మందికి అనుభ‌వాల‌ను..వెల‌క‌ట్ట‌లేని గుణ‌పాఠాల‌ను నేర్పి వెళ్తుంది. 2019 సంవ‌త్స‌రం కూడా స‌ర్వ‌జ‌నుల‌కు ఇదే చెప్పే ఇక సెల‌వంటూ వెళ్లిపోయేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

 

గ‌త జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేస్తూ..భ‌విష్య‌త్‌ను ఊహిస్తూ..జీవితంలోకి స‌రికొత్త ఉష‌స్సును ఆశిస్తూ.. ఎన్నో ఆశ‌లు..ఎన్నెన్నో ఆశ‌యాలు..జీవితానికి కొత్త‌గ‌మ్యాలను ఏర్పరుచుకుంటూ.. ఇలా ఎన్నో ఊహాల ప‌ల్ల‌కికి రెక్క‌లు తొడుగుతూ కొత్త సంవ‌త్స‌రానికి వెల్‌క‌మ్ చెప్పేందుకు జ‌నాలు సిద్ధ‌మ‌వుతున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో సాధించాల్సిన‌..ఆచ‌రించాల్సిన వాటిపై ప్ర‌తీది ప్లాన్ చేసుకుంటూ.. కొత్త సంవ‌త్స‌రంలో జీవితం బంగారు లోకం కావాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆశ‌ప‌డుతుంటారు.

 

మందు మానేయ్యాల‌ని..సిగ‌రెట్‌కు దూరంగా ఉండాల‌ని ఇలా చెడు అల‌వాట్ల‌ను దూరం చేసుకోవాల‌ని కొంద‌రు ప్ర‌తిన బూనుతుండ‌టం మ‌న‌కు స‌హ‌జంగా క‌నిపిస్తుంటుంది. ఓ విద్యార్థి తాను మంచి కాలేజీలో లేదా యూనివ‌ర్సిటీలో సీటు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కొత్త సంవ‌త్స‌రం నుంచి త‌న కృషిని ప్రారంభించాల‌నుకుంటాడు. ఓ వ్యాపారి మ‌రింత ఎదుగుద‌లకు అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటూ..ఓ రాజ‌కీయ నాయ‌కుడు జ‌న నాయ‌కుడిగా ఎదిగేందుకు ఈ సంవ‌త్స‌రంను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావిస్తాడు.

 

త‌మ పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు త‌ల్లిదండ్రులు కుటుంబానికి కొత్త‌ధ‌నం తీసుకువ‌చ్చేందుకు నాంది ప‌లుకుతారు. కొత్త సంవ‌త్స‌రం త‌మ జీవితాల్లో మార్పు తీసుకువ‌స్తుంద‌ని, తీసుకు రావాల‌ని బ‌ల‌మైన కోరిక‌తే స‌క‌ల జ‌నులు  అనేక కొత్త నిర్ణ‌యాలతో ప్ర‌య‌త్నాలు ఆరంభిస్తారు. అనుకున్న‌వ‌న్నీ అంద‌రూ సాధించ‌క‌పోవ‌చ్చు..కానీ ప్ర‌య‌త్నాన్ని మాత్రం కొత్త సంవ‌త్స‌రం ప్రొత్స‌హిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వారంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెబుతోంది 2020 సంవ‌త్స‌రం..

మరింత సమాచారం తెలుసుకోండి: